2017 జూలై 1. దేశంలో ఒక్కసారిగా గగ్గోలు రేగింది. రైల్వే స్టేషన్ల ముందు.. అమ్మే పళ్లు తోముకునే వేపపుల్లల వాడి దగ్గర్నుంచి. రియల్ ఎస్టేట్ వ్యాపారి వరకూ .. ప్రతి ఒక్కరూ తమ తమ వ్యాపారాల స్థాయిలో రేట్లు పెంచేశారు. అదేమిటంటే.. అందరి నోటి నుంచి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట జీఎస్టీ. ఒకే దేశం.. ఒకే పన్ను పేరుతో… ప్రజలను సంసిద్ధం చేయకుండా.. వ్యాపారాలకు అవగాహన కల్పించకుండా.. ఇంప్లిమెంట్ చేసిన జీఎస్టీ.. దేశ ప్రజల్లో ప్రభుత్వం ఓ కొత్త పన్ను వేసిందనే భావన తీసుకొచ్చింది. ఫలితంగా… ప్రతి ఒక్క వస్తువు రేట్లను వ్యాపారులు పెంచేశారు. ఇప్పటికీ ఆ గందరగోళం తగ్గలేదు. అటు వ్యాపారుల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ ఈ అయోమయం ఉంది.
దశాబ్దకాలం పాటు చర్చోపచర్చల తర్వాత జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. వస్తువులు, సేవల స్లాబులు ఏడాదిలోనే అనేక సార్లు మార్పులు చేర్పులు జరిగాయి. జీఎస్టీ అమలవుతున్న తొలిరోజుల్లోనే దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, వ్యాపారులు కొత్త పన్ను వ్యవస్థలో ఇప్పటికీ ఇమడలేకపోతున్నారు. ఈ సమస్యకు తోడు జీఎస్టీ రిఫండ్లు ఆలస్యం అవుతున్నాయి. చిన్న చిన్న పొరపాట్లకు కూడా రిఫండ్లను పొందలేకపోతున్నారు.
ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే జీఎస్టీని అమలు చేశారనేదానికి జీఎస్టీ పోర్టల్ పెద్ద సాక్ష్యం. జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయడంలో పోర్టల్ సృష్టించిన సమస్యలతో అనేక సందర్భాలలో ప్రభుత్వం గడువులను పొడిగించిన సందర్భాలున్నాయి. జీఎస్టీ అమలులో ప్రభుత్వం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య పన్ను రేట్లను హేతుబద్ధం చేయడం. ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. గత కొంత కాలంగా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతూ ఉన్నది. ఈ విషయంలో రాష్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
అటు ప్రజలుకు.. ఇటు ప్రభుత్వానికి క్లారిటీ లేని జీఎస్టీని రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నేతలు గబ్బర్ సింగ్‌గా అవహేళన చేస్తూ ఉంటారు. ఆయన మాటలను వ్యతిరేకించలేదు. ఎందకంటే అంత కంగాళీగా ఉంది మరి. అయినా సరే ప్రభుత్వం ఎప్పుడూ తప్పు కోదుగా.. అందుకే జీఎస్టీ వార్షికోత్సవాన్ని ఘంగా జరుపుకోనుంది. ఆదివారం జరిగే వేడుకలకి ఇన్చార్జ్ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హజరై..జీఎస్టీ ఎంత గొప్పగా ప్రజల జీవితాలను మార్చి వేసిందో..కథలు..కథలుగా చెప్పనున్నారు.