భారతీయ జనతా పార్టీ విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని ఓటర్ల మీద పూర్తి స్థాయిలో అన్వయించుకోవడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా తమ పార్టీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాని ముస్లింలలో.. కనీసం ఇరవై శాతం ఓట్లయినా సంపాదించుకునేలా.. ఆ వర్గం మహిళలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ వివాదంతో .. ముస్లిం మహిళలను ఆకట్టుకున్నామనుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు ఇంకో ముందడుగు వేసింది. ఇస్లామిక్ వివాహ చట్టంలో ఉన్న వివిధ వివాదాస్పద అంశాలను వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఇస్లామిక్ వివాహ చట్టంలో నిఖా హలాలా, నిఖా ముటా, నిఖా మిసయార్ అనే సంప్రదాయాలున్నాయి. దీంతో పాటు బహుభార్యత్వం కూడా ఇస్లామిక్ వివాహ చట్టంలో ఉంది. వీటన్నింటినీ అనుమతించే అధికరణాలనూ వ్యతిరేకించాలని కేంద్రం నిర్ణయించింది.
ట్రిపుల్ తలాక్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనల సమయంలోనూ వీటిని కూడా వ్యతిరేకించామని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ట్రిపుల్ తలాక్ కేసు సమయంలో ఈ అంశాలను సుప్రీంకోర్టు పరిశీలించలేదని అందుకే ఇప్పుడు కొత్తగా మార్చే ప్రయత్నం చేస్తున్నామంటోంది. కోర్టులో మళ్లీ వాదనలు వినిపించబోతోంది. నిఖా హలాలా ప్రకారం భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పాక వివాహం రద్దయినట్టే. ఆ భర్త ఆమెను తిరిగి భార్యగా స్వీకరించాలనుంటే.. నిఖాహలాలా ప్రకారం కుదరదు. ఆమె వేరేవారిని పెళ్లి చేసుకుని . విడాకులిచ్చిన తర్వాతే అది సాధ్యం. బహుభార్యాత్వ నిబంధన ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. ఇదే సూత్రం మహిళలకు వర్తించదు. నిఖా ముటా ప్రకారం షియాల్లో ఒక మహిళను కొన్ని రోజులపాటు తాత్కాలిక భార్యగా స్వీకరించే అవకాశం ఉంది. అయితే ఎన్ని రోజులన్నది నిర్దిష్టంగా పేర్కొనాలి. కాంట్రాక్ట్ మ్యారేజ్‌గా దీనికి పేరు. ఇక నిఖా మిసయార్ అనేది సున్నీల్లో ఉండే స్వల్పకాలిక వివాహ విధానం. దీనికి కూడా కొన్ని నియమ నిబంధనలున్నాయి.
ఈ నాలుగూ మానవ హక్కులను హరించేవిగా ఉన్నాయని కొంత మంది మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ట్రిపుల్ తలాక్ క్రూరమైనది కాగా, నిఖా హలాలా రేప్ కిందకు వస్తుందని, బహుభార్యాత్వం కూడా నేరమేనని పేర్కొన్నారు. అయితే ఇస్లామిక్ చట్ట వ్యవహారాల్లో కోర్టుల జోక్యం తగదని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. ఈ నాలుగింటి రద్దు ద్వారా ముస్లిం మహిళలకు వివాహ భద్రత కల్పించగలమని బీజేపీ బయటకు చెబుతోంది. కానీ అసలు విషయం మాత్రం.. దీన్ని వివాదాస్పదం చేసి.. ముస్లిం మహిళలకు లబ్ది చేకూర్చుతున్నట్లు ప్రచారం చేసుకుని ఓట్లు పొందడమే.
ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో ఆర్జేడీ, మజ్లిస్, అన్నాడీఎంకే, బీఎస్పీ లాంటి పక్షాలు దాన్ని వ్యతిరేకించాయి. చట్టంలో ఇష్టం వచ్చినట్లు అరెస్టులు చేయవచ్చన్న క్లాజ్‌ను టీడీపీ వ్యతిరేకించింది.