తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జన చైతన్య యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రను భాజపా ప్రతిష్టాత్మంగా తీసుకుంది. అయితే, జాతీయ నేతలు ఈ యాత్రలో భాగస్వామ్యమైతే పార్టీని ఉపయోగకరంగా ఉంటుందనీ, పార్టీ శ్రేణులతోపాటు ప్రజల్లో కూడా మంచి ఊపు వస్తుందని లక్ష్మణ్ భావిస్తున్నారు. అందుకే, రెండో విడత యాత్రలో వరుసగా జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు రాబోతున్నారు. నిజానికి లక్ష్మణ్ యాత్రను ఒక కేంద్రమంత్రి ప్రారంభించాల్సి ఉంది. కానీ, వేరే కారణాల వల్ల సాధ్యం కాలేకపోయిందన్నారు! దాదాపు 15 నియోజక వర్గాల్లో లక్ష్మణ్ పర్యటించాక.. జాతీయ నేతల రాక మొదలైంది.
శనివారం దుబ్బాకలో జరిగిన సభకు జీవీఎల్ నర్సింహారావు పాల్గొన్నారు. మంగళవారం నాటి సభకు హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారాం వస్తారు. ఆ మర్నాడు చిట్యాలలో జరగబోతున్న సభకు వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల రాబోతున్నారు. జులై 5న హన్మకొండ సభకు రామ్ మాధవ్ హాజరు కాబోతున్నారు. ఆ మర్నాడు.. అంటే యాత్ర ముగింపు సభకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఈ నెల 13న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఎట్టకేలకు తెలంగాణకు వస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన పర్యటన వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన పార్టీ సంస్థాగత బలోపేతానికి సంబంధించి కీలక చర్చలు చేపడతారని అంటున్నారు.
ఇలా తరచూ జాతీయ నేతలు రాష్ట్రానికి వస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి..! నిజానికి, తరచూ నేతలు వచ్చినంత మాత్రాన భాజపా బలోపేతానికి ఎలా ఉపకరిస్తుంది..? కాకపోతే, తరచూ పార్టీ శ్రేణుల్లో కొంత హడావుడీ, వార్తల్లో ఉంటారు. అంతేగానీ… కొత్తగా పార్టీని బలోపేతం కావాలంటే ముందుగా కేడర్ తోపాటు, పార్టీలో కొంతమంది పేరున్న నేతలు చేరాల్సి అవసరముంది. అయితే, అమిత్ షా రాక సందర్బంగా కొన్ని చేరికలు ఉంటాయని గతంలో చాలాసార్లు రాష్ట్ర నేతలు చెబుతూ వచ్చారు. ప్రముఖ పార్టీల నుంచి వచ్చి చేరేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారనీ అన్నారు. కనీసం ఈసారైనా, అమిత్ షా పర్యటన నేపథ్యంలో చేరికల కార్యక్రమం ఉంటే.. పార్టీ బలోపేతానికి అది కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంతేగానీ… తరచూ నాయకులు వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన అనూహ్య మార్పులు ప్రాక్టికల్ గా సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.