యువ దర్శకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ నగరానికి ఏమైంది కూడా నిర్మాతకు లాభాలు తెచ్చే సినిమానే. మూడో సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్‌లోనే తీస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు తరుణ్. పెళ్లి చూపులు సినిమా చూసి… దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు.. తరుణ్ భాస్కర్‌ని ఇంటికి పిలిచి.. భోజనం పెట్టారట. పప్పన్నం, నెయ్యి, అప్పడంతో సాగిన ఆ భోజనం తనకెప్పుడూ గుర్తుంటుందని చెప్పుకొచ్చాడు. తరుణ్‌లో ఓ మంచి క్రికెటర్ ఉన్నాడు. లక్ష్మణ్ ఉండే అపార్ట్మెంట్‌లోనే తరుణ్ భాస్కర్ వాళ్లు కూడా ఉండేవార్ట. లక్ష్మణ్ నెట్ ప్రాక్టీస్ చేస్తుంటే.. తరుణ్ బౌలింగ్ వేసేవాడట. తనెంత చెత్తగా బంతులు వేసినా – లక్ష్మణ్ ఓపిగ్గా బ్యాటింగ్ చేసేవాడని చెప్పుకొచ్చాడు తరుణ్. పెళ్లి చూపులు విడుదల కాకమునుపు కొంతమంది బయ్యర్లకు చూపిస్తే.. ‘ఇదేం సినిమా.. నీకు డబ్బులుంటే వేరేలా ఖర్చు పెట్టుకో… ఇలాంటి సినిమాలు తీయకు` అన్నార్ట. ఒకాయనైతే ‘ఇందులో స్కిన్ షో ఉందా?’ అని ప్రశ్నించాడట. అవన్నీ తనకు బాగా ఇబ్బంది పెట్టాయట.