అటు రాజకీయాలు – ఇటు సినిమాలు.. రెండు పడవల ప్రయాణం చేయడం మన స్టార్లకు ఇష్టం ఉన్నట్టు లేదు. పవన్ కల్యాణ్‌ని చూడండి. రాజకీయాల గురించి సినిమాలకు దూరమయ్యాడు. 2019 ఎన్నికలు ముగిసేవరకూ సినిమాల గురించి ఆలోచించే మూడ్‌లో లేడు పవన్. ఇప్పుడు కమల్ హాసన్ కూడా అదే మాట చెబుతున్నాడు. రాజకీయాలు, సినిమాలు రెండింటినీ బాలెన్స్ చేయడం కష్టమని, ఇక మీదట పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడతానని, సినిమాలకు దూరం కావడం తప్పట్లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసిన కమల్… ఓ అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ… ‘సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింద’టూ కుండబద్దలు కొట్టాడు.
కమల్ – శంకర్ కాంబోలో రానున్న `భారతీయుడు 2` కమల్ చివరి చిత్రం అనుకోవొచ్చు.
అయితే రజనీకాంత్ మాటేంటి? ‘రాజకీయాల్లోకి వస్తున్నా’ అని చెప్పడం, అభిమానులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించడం తప్ప… ఇంకో అడుగు ముందుకు వేయలేదు. కనీసం పార్టీ స్థాపిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. రోబో 2.0 తరవాత కూడా రజనీ సినిమాలు చేసే మూడ్‌లోనే కనిపిస్తున్నాడు. పిజ్జా దర్శకుడితో ఇటీవలే ఓ సినిమా పట్టాలెక్కించాడు. రాజకీయాల్లోకి వచ్చాక.. సినిమాలకు దూరం అవుతానని ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ పార్టీ స్థాపించిన తరవాత.. అప్పుడు ఆ విషయం ఆలోచిస్తాడేమో. ప్రస్తుతానికైతే రజనీ పూర్తిగా రాజకీయాలవైపు దృష్టి పెట్టే పరిస్థితి కనిపించడం లేదని అక్కడి సినీ, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.