మరో మూడు రోజుల్లో డిల్లీలో జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో బారీ విద్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు డిల్లీలో చొరబడ్డారనే నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తమయిన జాతీయ దర్యాప్తు బృందం అధికారులు (ఎన్.ఐ.ఎ.) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో నిన్న హైదరాబాద్, కర్ణాటక మరి కొన్ని ప్రాంతాల నుంచి 10 మంది ఐసిస్ సానుభూతిపరులని అరెస్టు చేసారు.
డిల్లీలో హైఅలర్ట్ ప్రకటించి, ఉగ్రవాదుల కోసం పోలీసులు వెదుకుతున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున డిల్లీలో చాలా అట్టహాసంగా జరిగే కార్యక్రమాలలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు, దేశవిదేశీ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, వేలాదిమంది ప్రజలు పాల్గొంటారు కనుక అక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కనుక ఈ మూడు రోజుల్లో మరి కొంతమంది అనుమానితులను అరెస్ట్ చేయవచ్చును.
నిన్న బెంగళూరులో అరెస్టయిన వారిలో మొహమ్మద్ అఫ్జల్ (35)కి ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేదని, అతను వైట్ ఫీల్డ్స్ సమీపంలో గల ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడని అతని భార్య బుష్రా తబసుమ్ మీడియాకు తెలిపారు. బెంగళూరులో ఉన్న సయ్యద్ అన్సార్ షా ఖస్మి అనే మతగురువు ప్రవచనాలు వినడానికి తన భర్త అప్పుడప్పుడు వెళుతుంటారని, బహుశః అందుకే అరెస్ట్ చేయబడి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఆమె తెలిపారు.
“రాత్రి సుమారు 3గంటలకు తలుపు చప్పుడు అయితే వెళ్లి తీయగానే సుమారు 30-35మంది ఎన్.ఐ.ఎ. అధికారులు లోపలకి చొచ్చుకు వస్తూనే తన భర్త చేతులకు సంకెళ్ళు తగిలించి, “ఆయుధాలు ఎక్కడ దాచావో చెప్పు?” అంటూ తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత వారు ఇల్లంతా శోదాలు చేసారు కానీ ఏమీ దొరకలేదు. మా కంప్యూటర్, కొన్ని కాగితాలు, మోటార్ సైకిల్, కారును తీసుకు వెళ్ళిపోయారు. నా భర్తని అరెస్ట్ చేసి తీసుకు వెళ్లిపోయారు. అ సమయంలో నన్ను, మా ఆరేళ్ళ పాపని తుపాకి గురి పెట్టి ఒకగాధిలో నిర్బంధించారు. నా బంధువులు ఎవరికీ ఫోన్ చేయడానికి కూడా అనుమతించలేదు. మా కళ్ళ ముందే నా భర్తని కొడుతుంటే మేము నిస్సహాయంగా, భయంతో చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. మా బైక్ ని, కారుని ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద నుండి తీసుకుపోమని నిన్న మాకు కబురు పంపించేరు. నా భర్త ఒక సామాన్య ఉద్యోగి. ఉగ్రవాదులతో అతనికి ఎటువంటి సంబంధాలు లేవు. త్వరలో అతనిని విడిచి పెడతారని ఆశిస్తున్నాము,” అని బుష్రా తబసుమ్ అన్నారు.
83 ఏళ్ల వయసుగల సయ్యద్ హుస్సేన్ అనే రిటర్డ్ తహసిల్దార్ కూడా ఆమెలాగే ఆవేదన వ్యక్తం చేసాడు. “నా కొడుకు సయ్యద్ ముజాహిద్ (33) ఎటువంటి దేశ వ్యతిరేక పనులు చేయడం లేదు. మా ప్రాంతంలో ప్రవచనాలు చెప్పడానికి అపుడప్పుడు వచ్చే ముస్లిం మత గురువులకు సేవలు చేస్తుంటాడు. అంత మాత్రాన్న అతనికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కాదు. అతనికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవు. త్వరలో అతనిని విడిచిపెడతారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
బహుశః ఎన్.ఐ.ఎ. అధికారులు అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది ఇదేవిధంగా ఆవేదన వ్యక్తం చేస్తుండవచ్చును. ఈ విషయంలో ఎన్.ఐ.ఎ. అనుమానాలు నిజమా లేక అరెస్టయిన వారి కుటుంబ సభ్యులు చెపుతున్న మాటలు నిజమా అనే విషయంపై ఇప్పుడే ఏదో ఒక అభిప్రాయానికి రావడం సరికాదనే చెప్పవచ్చును. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎన్.ఐ.ఎ. అధికారులు అరెస్ట్ చేసారని భావించలేము. అలాగే అరెస్టయిన వారి కుటుంబ సభ్యులు చెపుతున్న మాటలు అబద్దాలని అనుకోలేము. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ అరెస్టులను ఎవరూ వ్యతిరేకించడం సబబు కాదు. కానీ అరెస్టులు చేసే ముందు ముస్లిం సమాజంపై వాటి ప్రభావం కూడా పరిగణనలోకి తీసుకొని, పూర్తిగా నిర్ధారణ చేసుకొన్న తరువాతనే అరెస్టులు చేయడం మంచిది. అరెస్టయిన వారి కుటుంబ సభ్యుల ఆవేదన అర్ధం చేసుకోదగినదే కానీ వారు కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఓర్మి వహించక తప్పదు.