- సినిమాలయందు బయోపిక్‌లు వేరయా…!
- అవును. సినిమా అనేది కచ్చితంగా కల్పిత ప్రపంచం. ఓ ఫాంటసీ. లార్జన్ దెన్ లైఫ్.
- బయోపిక్ అలా కాదు. అది జీవితం. జరిగిన కథ.. ఆ మాటకొస్తే చరిత్ర.
ఏదో ఓ కమర్షియల్ సినిమా తీసినంత ఈజీ కాదు.. చరిత్రని తెరకెక్కించడం. బయోపిక్ తీయాలంటే గట్స్ కావాలి. ఓ పరిశోధన చేయాలి. నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్ము కావాలి. జీవితంలో ఎత్తులు, పల్లాలు, గెలుపులు, ఓటములు, మంచి, చెడు, తప్పులు ఒప్పులు ఇవన్నీ కూలంకుశంగా చెప్పగలగాలి. నాణానికి రెండు వైపులూ చూపించాలి. కానీ మన బయోపిక్‌లు ఇవన్నీ చేస్తున్నాయా? రాబోయే బయోపిక్లైనా సత్యాలే చెబుతాయా? – ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న.
తెలుగులో బయోపిక్‌ల వ్యవహారం చాలా తక్కువ. ఇప్పుడైతే ఇంత ఉధృతంగా బయోపిక్ లు వస్తున్నాయి గానీ ఒకప్పుడు బయోపిక్ అంటే భయం. దానికి చాలా కారణాలున్నాయి. ఓ మనిషి జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని.. దాన్ని తెరపైకి తీసుకురావడం చాలా కష్టం. ఈ విషయం మన దర్శక నిర్మాతలకు బాగా తెలుసు. ఉన్నది ఉన్నట్టుగా తీయడమే బయోపిక్. అలా తీస్తే… అది డాక్యుమెంటరీ అయిపోతుంది. కమర్షియల్ ఛాయలేం ఉండవు కాబట్టి.. సినిమాకి సరిపడా కథా వస్తువగా బయోపిక్ ని చూడలేకపోయారు. ఆంధ్ర కేసరి, అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలొచ్చినా.. అవి బయోపిక్‌లు కావు. కేవలం ఆ వ్యక్తి జీవితంలోని ముఖ్య సంఘటనల్ని ఉదహరిస్తూ.. దాని చుట్టూ సినిమాకి తగిన కథ, కథనాల్ని అల్లారు.
‘మహానటి’తో బయోపిక్‌ల జోరు ఊపందుకుంది. ఓ విధంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని కూడా బయోపిక్ గా చెప్పుకున్నారు. ఇప్పుడు ‘సైరా’, ‘ఎన్టీఆర్’, ‘యాత్ర’ తయారవుతున్నాయి. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. ‘మహానటి’ బాక్సాఫీసు దగ్గర మంచి విజయం అందుకుంది. కాకపోతే.. విమర్శకులు ఈ సినిమా చూసి.. కొన్ని లోపాల్ని ఎత్తి చూపించారు. సావిత్రి జీవితంలోని చీకటి కోణాల్ని గ్లోరిఫై చేశారని, ఇది అసలు బయోపిక్కే కాదని తేల్చేశారు. ‘ఇది సావిత్రి కథే… కానీ మధర్ దెరిస్సా నేపథ్యంలో తీశారు’ అని కొంతమంది జర్నలిస్టులు సెటైర్లు వేశారు. సావిత్రి ని ఉదాత్తంగా చూపించాలన్న తపన దర్శక నిర్మాతల్లో కనిపించింది. అయితే… ప్రేక్షకులకు ఇవేం పట్టలేదు. సినిమాని సినిమాగా చూశారు. నీరాజనాలు పలికారు.
ఇప్పుడు సంజు వచ్చింది. ఇది తెలుగు సినిమా ఏం కాదు. కానీ సంజయ్ దత్ జీవితంపై ఉన్న ఆసక్తి, రాజ్ కుమార్ హిరాణీ పై ఉన్న నమ్మకం, ప్రేమ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సినిమా చూసినవాళ్లంతా ఆహా.. ఓహో అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం లోపాల్ని ఎత్తి చూపిస్తున్నారు. సంజూ జీవితాన్ని ఇంత గ్లోరిఫై చేయాల్సిన అవసరం ఏముంది? అమాయకుడిగా చూపించి… సింపతీ కొట్టేయాలని చూస్తారా? అంటూ మండి పడుతున్నారు. రాజ్ కుమార్ హీరాణీ లాంటివాడే.. నిజాల్ని కప్పిపుచ్చి మాయ చేయాలని చూశాడంటే.. ఇప్పుడు రాబోయే బయోపిక్‌లు ఎలా ఉంటాయో, వాటిలో కవరింగు శాతం ఎంతో ఊహించుకోవొచ్చు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్‌పైనే అందరి దృష్టీ. ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా చేస్తున్నారు అనగానే… అందరిలో మెదిలే ప్రశ్న ఒక్కటే. ‘చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఎపిసోడ్ ఉంటుందా? లేదా’ అని. బాలయ్య – చంద్రబాబు మధ్య అనుబంధం, చుట్టరికం తెలిసిన వాళ్లెవరైనా సరే.. ఆ ఎపిసోడ్ ఎత్తేయడం ఖాయమని ఈజీగా చెప్పేస్తారు. అధికార మార్పిడి, వెన్నుపోటు రాజకీయాలు, వైశ్రాయ్ ఉదంతం, లక్ష్మీపార్వతితో వివాహం… ఇలా ఎన్టీఆర్ ఇమేజ్‌కీ, ప్రస్తుత టీడీపీ పార్టీకీ, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఎలాంటి డామేజ్ రాకుండా ఈ సినిమాని అత్యంత పకడ్బందీగా తీస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ బాల్యం నుంచి కథ మొదలై.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంతో ఈసినిమా పూర్తవ్వబోతోందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అంటే.. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రకున్న ప్రాధాన్యం అంతంత మాత్రమే అన్నమాట. అలాంటప్పుడు వెన్నుపోటు ఎపిసోడ్ ఎక్కడ ఉంటుంది? సో.. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి కూడా నిజాలు ఆశించలేం.
దీన్ని బట్టి అర్థమవుతున్న నీతి ఒక్కటే. మనం బయోపిక్‌లు తీస్తున్నాం. కానీ అవి బయోపిక్‌లు కావు. ఓ వ్యక్తి జీవితానికి కమర్షియల్ టచ్ ఇస్తున్నామంతే. ఓ రకంగా ఇవి కూడా ఫక్తు కమర్షియల్ సినిమాలే అనుకోవాల్సివుంటుంది. వ్యక్తి జీవితంలో మంచీ చెడూ రెండూ ఉంటాయి.
వాటిని అలా చూపించగలిగినప్పుడే అది బయోపిక్ అనిపిస్తుంది. ‘ఇతను గొప్పవాడు.. గొప్పవాడు.. చాలా గొప్పవాడు. మందు తాగినా గొప్పవాడే.. అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా గొప్పవాడే’ అని ప్రేక్షకుల మీద రుద్దితే.. దాని వల్ల ఉపయోగం ఏముంది? ఆ చరిత్ర తెలుసుకున్న ప్రయోజనం ఎక్కడ ఉంటుంది? బయోపిక్‌లో ఉన్నది ఉన్నట్టుగా చెబితే… ఎక్కడి నుంచి ఎలాంటి బెదిరింపులు వస్తాయో అని దర్శక నిర్మాతల భయం. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని తనయుడు బాలయ్య చేస్తున్నప్పుడు ఆయనలోని లోపాల్ని చూపించగలడా?? సావిత్రి బయోపిక్‌ని సావిత్రి వారసుల సమక్షంలో తెరకెక్కిస్తున్నప్పుడు ఆమెలోని తప్పుల్ని ఎంచగలమా? సంజయ్ దత్ కథ, సంజూ బతికున్నప్పుడే, తన అనుమతితో తీస్తున్నప్పుడు – ఆయనలోని దోషాల్ని తెరపైకి తీసుకురాగలమా? ఇవన్నీ అసాధ్యాలు.
సావిత్రి, ఎన్టీఆర్, సంజూ.. వీళ్ల కథలు సినిమాలుగా వస్తున్నాయంటే.. జనాలు ఎగబడతారు. అభిమానులు చొక్కాలు చింపుకుంటారు. ఏదో ఉంటుందిలే అని ఆశిస్తారు. అది చాలు.. దర్శక నిర్మాతలు సొమ్ము చేసుకోవడానికి. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి తప్ప…
నిస్పక్షపాతంగా ఓ జీవితాన్ని తెరపైకెక్కించాలన్న ఆశ, ఆలోచన ఏ ఒక్కరికీ లేవు. అందుకే.. బయోపిక్‌లు కాస్త అర్థం మార్చుకుని, అదో కొత్త కమర్షియల్ ఫార్ములాగా అయిపోతున్నాయి.