ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీ వైకాపా పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే..! ఎంపీల రాజీనామాలే చివరి అస్త్రం అన్నారు. రాజీనామాలు ఆమోదింపజేసుకున్నాక… వంచనపై గర్జన అంటూ దీక్షలు మొదలుపెట్టారు. మొదటి దీక్ష విశాఖలో, రెండోది నెల్లూరులో.. ఈరోజున మూడో దీక్ష అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇది కూడా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో భాగంగా చేపడుతున్న దీక్షే. అయితే, గడచిన రెండు గర్జనల సభల్లోనూ వైకాపా విధానంలో లోపించిన స్పష్టతే ఇప్పటికీ కనిపించింది. ప్రత్యేక హోదా సాధన కోసమే దీక్షలు అంటున్నారుగానీ… ఇవ్వాల్సిన కేంద్రంపై ఈ దీక్షలు ఏ విధంగా ఒత్తిడి పెంచగలవనేది ప్రజలకు స్పష్టంగా వివరించలేకపోతున్నారు. ఎందుకంటే, పార్లమెంటులో మాట్లాడే ఎంపీలు లేరు. ఢిల్లీలో దీక్షలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. మరి, ఈ గర్జనలు మోడీకి ఎలా వినిపిస్తాయి..?
పాదయాత్రలో జగన్ చేస్తున్న విమర్శలకీ, ఈ దీక్షలకీ మధ్య స్పష్టమైన వ్యతాసమంటూ లేకుండా పోతోంది. అక్కడా ఇక్కడా ఏపీ సర్కారుపై విమర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. పైగా, నాలుగేళ్లపాటు పోరాడుతూ వస్తున్నామని జగన్ చెబుతున్నారే తప్ప… ఆ పోరాటానికి ఒక ఉద్యమ రూపం ఇవ్వలేకపోయారు. తమ వల్లనే ప్రజలు ఉద్యమిస్తున్నారని జగన్ ఉపన్యాసాల్లో చెబుతారే తప్ప… ఆ ఉద్యమం క్రమం ఏంటనేది మాత్రం వారికే స్ఫష్టత లేని అంశంగానే ఉంటోంది. ప్రత్యేక హోదా సాధనే ఉద్యమం అయినప్పుడు… ఉద్యమ కమిటీలేవీ? దశలవారీగా ఉద్యమాన్ని నడిపించే కార్యాచరణ ఎక్కడుంది..? ఇంతకీ ఈ అదృశ్య ఉద్యమానికి నాయకుడు ఎవరు..? సో.. ఎలా చూసుకున్నా ప్రజల్లో ఉన్న ప్రత్యేక హోదా సెంటిమెంట్ ను వైకాపా ఏరకంగానూ ఉద్యమ రూపు తీసుకుని రాలేకపోయింది. దీన్ని చంద్రబాబుపై విమర్శలు చేయడానికి అనువైన ఒక అంశంగా మాత్రమే ఇప్పటికీ చూస్తున్నారు.
విశాఖ, నెల్లూరు.. కొనసాగింపుగా ఇప్పుడు అనంతపురంలో జరుగుతున్న వంచనపై గర్జన సభలు కూడా దేనికదే అన్నట్టు కనిపిస్తోంది. అంతేగానీ… విశాఖ తరువాత నెల్లూరులో మరింత తీవ్రతరం, ఆ తరువాత అనంతకు వచ్చేసరికి మరో రకమైన కార్యాచరణలాంటివి కనిపించడం లేదు. ఇవన్నీ ఒక్కో సభల్లా కనిపిస్తున్నాయేగానీ.. ఒకే ఉద్యమంగా మార్చడంలో ఇప్పటికీ వైకాపా విఫలమౌతూనే ఉంది. మూడో సభ జరుపుకుంటున్న ఈ తరుణంలో కూడా ఇలాంటి విశ్లేషణ వైకాపా నేతలు చేసుకుంటున్నట్టు లేదు. ఇంకోటి.. వంచనపై గర్జన అంటున్నారే తప్ప… కేవలం టీడీపీపై మాత్రమే గర్జిస్తారు, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా విమర్శించరు! కనీసం, ఏపీ ప్రజల తరఫున తీవ్రంగా డిమాండ్ చేసినా కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ స్పష్టత లోపం వల్లనే పేరులో గర్జన ఉంటోందే తప్ప, ఆ స్వరం ఢిల్లీ వరకూ వినిపించే పరిస్థితి లేదు.