తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి చక్కటి పబ్లిసిటీ చేసి నిర్మాతగా లాభాలు వెనకేసుకోవడంలో సురేశ్‌బాబు ఎక్స్పర్ట్. లో బడ్జెట్ సినిమాల్లో కొత్త హీరోలను పరిచయం చేయడానికి మొగ్గు చూపుతారు. ఆయన చిత్ర సమర్పకుడిగా వ్యవహరించన ‘ఉయ్యాలా జంపాలా’తో రాజ్ తరుణ్, ‘తను నేను’ సంతోష్ శోభన్, నిర్మాతగా తాజా సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నలుగురు కొత్త కుర్రాళ్లను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన సంస్థలో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఓ సినిమాతో ‘అర్జున్‌రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్నారని టాక్.
తెలంగాణ నేపథ్యంలో కొత్త కుర్రాడు మహేంద్ర దర్శకత్వంలో ‘దొరసాని’ అని ఓ ప్రేమకథను సినిమాగా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు సురేశ్‌బాబు. అందులో హీరోగా ఆనంద్ దేవరకొండ పేరు పరిశీలనలో వుందట. అతడి సరసన ఓ నటుని కుమార్తె కథానాయికగా పరిచయం కానున్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తాడనే వార్తలు వస్తున్నాయి. హీరోగా తనకు ఫస్ట్ హిట్ ‘పెళ్లి చూపులు’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన సురేశ్‌బాబు సినిమాతో విజయ్ దేవరకొండ తన తమ్ముణ్ణి హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్నారన్న మాట.