‘శంభో శంకర’ విడుదలకు ముందు విలేకరుల సమావేశాల్లో షకలక శంకర్ మాట్లాడిన మాటలను సినిమా ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా అంత త్వరగా మర్చిపోలేరు. కథానాయకుడిగా మారాననే కటింగ్ అతడి మాటల్లో కనిపించింది. త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజ, అల్లు శిరీష్ తదితరుల దగ్గరకు వెళ్లి తనను హీరోగా పెట్టి సినిమాలు తీయమని అడిగానని, వారంతా రెండేళ్లు ఆగమన్నారని, ఈలోపు తానే నిర్మాతను వెతుక్కుని సినిమా చేశామని షకలక శంకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అతడు మాట్లాడిన తీరులో వ్యంగ్యం తొణికిసలాడింది. కమెడియన్ నుంచి కథానాయకుడిగా మారిన షకలక శంకర్ ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
గత శుక్రవారం సినిమా విడుదలైంది. చెప్పుకోదగ్గ రీతిలో ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ సినిమాలో సరుకు లేదని ప్రేక్షకులు తమ తీర్పు చెప్పేశారు. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. విడుదలకు ముందు షకలక శంకర్ చేసిన వ్యాఖ్యలు ఎంత చేటు చేస్తాయనే విషయం మెల్లగా సన్నిహితులు చెప్పార్ట. దాంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించాడు. ఆ రోజు తానెందుకు అలా మాట్లాడవలసి వచ్చిందో ఇండస్ట్రీ ప్రముఖులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. “ప్రీ రిలీజ్ ఫంక్షన్లో గెస్టులు ఎవరూ లేరు. సినిమాకి హైప్ తీసుకురావడం కోసమే అలా మాట్లాడాను తప్ప.. ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. అందులోనూ అందరూ సినిమా నిర్మిస్తామని అన్నారని కాకపోతే రెండేళ్లు ఆగమని చెప్పారని కూడా చెప్పాను. సినిమా పట్టాలు ఎక్కడానికి ముందు ఏం జరిగిందో చెబితే ప్రేక్షకుల్లో క్రేజ్ వస్తుందని అలా చేశాడు” – ఇదీ షకలక శంకర్ వెర్షన్. అతడి వ్యవహారం చేతులు కాలాక ఆకులు పెట్టుకున్నట్లుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ అతడి కెరీర్ మీద ఎంత వుంటుందనేది కాలమే చెబుతుంది.