ఈ శుక్రవారం వస్తున్న ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాపై పాజిటివ్ బజ్ వుంది. మెగాస్టార్ చిరంజీవి వచ్చి యూనిట్ ని ఆశిర్వాదించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రమోషన్ మెటిరియల్ కూడా ఆసక్తిని పెంచింది. అలాగే ఈ సినిమాపైనే ముగ్గురి జాతకాలు ఆదారపడి వున్నాయి. హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు కరుణాకరన్, నిర్మాత కెఎస్ రామారావు.. ఈ ముగ్గురికి ఈ సినిమా చాలా కీలకం.
మెగా కుటుంబం నుండి వచ్చి మాస్ ఫార్ములతో చెప్పుకోదగ్గ విజయాలే సాధించాడు తేజు. పిల్లా నీవు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం.. సినిమాలు ఆకట్టుకున్నాయి. అయితే తర్వాత వరుసగా ఫ్లాపులు వచ్చి పడ్డాయి. తిక్క, విన్నర్, ఇంటిలిజెంట్ ఇలా వరుస ఫ్లాపులు. వినాయక్ కూడా తేజ్ కి హిట్ ఇవ్వలేకపోయాడు. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే. తేజు మాస్ ఫార్ములని ఓవర్ చేశాడని. అదే ఫార్ములలో కధలు ఎంచుకోవడం వర్క్ అవుట్ కాదని తెలిసిపోయింది. అందుకే ప్రేమకధల స్పెషలిస్ట్ కరుణాకరన్ తో సినిమా చేశాడు. మరి ఈ సినిమా తేజుకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
కరుణాకరన్ విషయానికి వస్తే.. తొలిప్రేమ లాంటి ట్రెండ్ సెట్టర్ ని తీసిన దర్శకుడు. ఇప్పటికీ తొలిప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఆ సినిమా ఎంతటి ప్రభావం చూపించిందో. అయితే తర్వాత ఆ రేంజ్ సినిమా తీయలేకపోయాడు. మధ్యలో హ్యాపీ, డార్లింగ్ సినిమాలతో ఓకే అనిపించినా మునపటి కరుణాకరన్ కనిపించలేదు. ”ఎందుకంటె ప్రేమంట’ ఫ్లాపు తర్వాత వేగం కూడా తగ్గింది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి తీసిన ‘చిన్నదాన నీకోసం’ కూడా మరో ఫ్లాపు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ‘తేజ్ ఐ లవ్ యూ’ అంటూ ఓ సినిమా చూపించబోతున్నాడు. ఇదీ ప్రేమ కధే. ప్రేమకధల స్పెషలిస్ట్ అనిపించుకున్న కరుణాకరన్ కి ఇప్పుడు ఒక హిట్ కావాలి. అది ‘తేజ్ ఐ లవ్ యూ’ తో వస్తుందనే నమ్మకంగా వున్నాడు.
‘తేజ్ ఐ లవ్ యూ’ నిర్మాత కెఎస్ రామారావుకి కూడా ఈ సినిమా విజయం కీలకం. ఆయనది ఘనమైన చరిత్ర. దాదాపు నలఫైకి పైగా సినిమాలు తీసి అందులో చాలా బ్లాక్ బస్టర్స్, క్లాసిక్స్ ని అందుకున్న రికార్డ్ ఆయనది. అయితే మునపటిలా ఆయన సినిమాలు తీయడం లేదు. దినికి కారణం కూడా సక్సెస్ రేట్ లేకపోవడమే. ఇప్పుడు ఈ సినిమా కనుక విజయం సాధిస్తే ఆయన నుండి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం వుంది. ఈవిధంగా ఈ ముగ్గురి భవిష్యత్ కి కూడా ‘తేజ్ ఐ లవ్ యూ’ పై ఆదారపడివుందని చెప్పాలి.