దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు గత కొన్ని రోజులుగా వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే, జమిలి ఎన్నికలు వేరు… ముందస్తు వేరే అనేది ముందుగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాజస్థాన్ తోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటితో వీలైనన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని ముందుకో వెనక్కో జరిపి.. లోక్ సభతోపాటు ఎన్నికలు నిర్వహించడం ముందస్తు అవుతుంది. కానీ, జమిలి ఎన్నికల విషయానికొచ్చేసరికి… దేశం వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రతిపాదన. దీనిపై కూడా కొంత చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదే అంశమై ఈ మధ్య మాట్లాడుతున్నారు.
ఈ దిశగా తాజా ముందడుగు ఏంటంటే… జమిలి ఎన్నికలకు సంబంధించిన సంప్రదింపుల నిర్వహణకు లా కమిషన్ సిద్ధం కావడం. ఈ నెల 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో లా కమిషన్ సంప్రదింపులు జరుపుతుంది. లోక్ సభతోపాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఆయా రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతుంది. వీటితోపాటు ప్రజల నుంచి కూడా జమిలి ఎన్నికలపై సలహాలూ సూచనలూ లా కమిషన్ తీసుకోబోతోంది.
అయితే, జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వ సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నా.. చాలా అనుమానాలు నివృత్తి కావల్సి ఉంది. అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన సిబ్బంది, సంసిద్ధత ఉన్నాయా లేదా అనేది పెద్ద ప్రశ్న..? అంతేకాదు, ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగాక కూడా.. ఏదైనా రాష్ట్రంలో ఐదేళ్లలోపే ప్రభుత్వం పడిపోయి, రాష్ట్రపతి పాలన వస్తే.. తదుపరి పరిస్థితి ఏంటనేదీ ప్రశ్నే..? ఆయా రాష్ట్రాల్లో మిగతా కాలమంతా రాష్ట్రపతి పాలనలోనే కొనసాగించేస్తారా అనేదీ ప్రశ్నే..? ముందుగా ఇలాంటి అంశాలపై పార్టీలకు స్పష్టత ఇవ్వాలి. లేదంటే.. ఇలాంటి సందేహాలతో ఉన్న పార్టీలతో సంప్రదింపులు జరిపినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
అన్నిటికన్నా ముఖ్యంగా జమిలి ఎన్నికల నిర్వహణ, తదనంత పరిణామాలపై రాజ్యాంగపరమైన వెసులుబాటుపై ముందుగా చర్చ జరగాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి వస్తే… ప్రస్తుతం కేంద్రంలోని భాజపాకి మద్దతు ఇచ్చేవారు ఎంతమంది ఉంటారనేది కూడా సమస్యే. సో.. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు మంచివా కాదా అనే చర్చ పక్కనపెడితే… సాధ్యాసాధ్యాలు ఎలా అనేది ముందుగా తేలాల్సిన అంశం.