జి.హెచ్.ఎం.సి. ఎన్నికల తెరాసకు సారద్య బాధ్యతలు వహిస్తున్న తెలంగాణా ఐటి పంచాయితీ రాజ్ మంత్రి కె.తారక రామారావు, ఆరంభంలోనే తొందరపడి “ఈ ఎన్నికలలో తెరాస వంద సీట్లు గెలుచుకోకపోతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా నా సవాలును స్వీకరించి తమ పదవులకు రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నారా?” అని గొప్పగా సవాలు విసిరారు.
మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్షాలకు అటువంటి సవాళ్లు విసరడం చాలా పొరపాటు. అందునా ముఖ్యమంత్రి కుమారుడు అటువంటి సవాళ్లు విసరడం ఇంకా పొరపాటు. ఆ సంగతి నెమ్మదిగా అర్ధం అవడంతో తెరాస దానికి సవరణ ప్రకటన చేసింది. కె.టి.ఆర్. ఉద్దేశ్యం గ్రేటర్ పీఠం దక్కించుకొంటామనే కానీ ఎన్ని సీట్లు దక్కించుకొంటామని కాదని సవరణ విడుదల చేసింది. కానీ రాజకీయ నాయకులు ఒకసారి నోరు జారితే దానికి చాలా బారీగా మూల్యం చెల్లించవలసి వస్తుంటుంది.
కె.టి.ఆర్. విసిరిన ఆ సవాలును తెదేపా తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అందరు ముందూ స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు కె.టి.ఆర్. చెప్పినట్లుగా ఒకవేళ తెరాస వంద సీట్లు సాధించగలిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకొని తెలంగాణాని విడిచి పెట్టి వెళ్ళిపోతానని భీకర శపధం కూడా చేసారు. దానికి ఆయన కట్టుబడి ఉంటారో లేదో వేరే విషయం కానీ ఆ ప్రతి సవాలుతో తెరాసకు, మంత్రి కె.టి.ఆర్.కి జవాబు చెప్పక తప్పని పరిస్థితి కల్పించారు. అంతే కాదు ఎట్టిపరిస్థితులలో కూడా తెరాస వంద సీట్లు గెలుచుకోలేదనే సంగతి ప్రజలు నమ్మేలా గట్టిగా చెప్పగలిగారు. రేవంత్ రెడ్డి విసిరినా ఆ సవాలుకి ఇంతవరకు కూడా తెరాస నుంచి జవాబు రాకపోవడంతో దానిని తెరాస కూడా దృవీకరిస్తున్నట్లయింది.
ఈ పరిస్థితి చూసి ఇంతవరకు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మంత్రి కె.టి.ఆర్.తో చెలగాటం ఆడుకొనేందుకు ముందుకు వస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత మరియు శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ కూడా కె.టి.ఆర్. విసిరిన సవాలును తాను కూడా స్వీకరిస్తున్నానని, ఒకవేళ తెరాస వంద సీట్లు గెలుచుకొంటే తాను తన పదవి నుంచి, రాజకీయాల నుంచి కూడా శాస్వితంగా తప్పుకొంటానని ప్రకటించారు. మంత్రి కె.టి.ఆర్. కూడా తన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేసారు.
కాంగ్రెస్ పార్టీ కూడా కె.టి.ఆర్. సవాలుని స్వీకరించడంతో ఇప్పుడు తెరాస ఇంకా ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టబడింది. ఆ పార్టీ ఎట్టి పరిస్థితులలో కూడా వంద స్థానాలు గెలుచుకోలేదని ప్రతిపక్షాలు బల్లగుద్ది చెపుతున్నపుడు వాటిని ధీటుగా ఎదుర్కోలేకపోతే, ఆ ప్రభావం ఓటర్ల మీద తప్పక పడుతుంది. అప్పుడు వంద కాదు అందులో సగం కూడా సాధించుకోవడం కష్టమవుతుంది.
మొదట్లో తెరాస చాలా ఆత్మవిశ్వాసం కనబరిచినప్పటికీ క్రమంగా తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారం ఉదృతం చేయడం మొదలుపెట్టిన తరువాత తెరాస తన లెక్కలను మళ్ళీ సవరించుకోవలసి వస్తోంది. అందుకే కె.టి.ఆర్. సవాలుకి సవరణ ప్రకటన విడుదల చేయవలసి వచ్చిందని భావించవచ్చును. మారిన ఈ పరిస్థితిని చూసే ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీలతో సహా ఏ పార్టీకి మెజారిటీ రాదని లోకేష్ బాబు శలవిచ్చినట్లున్నారు.