పోలవరం ప్రాజెక్ట్ పనులు కొనసాగించడానికి.. ఆంధ్రప్రదేశ్‌కు జూలై 2వ తేదీ వరకే అవకాశం ఉంది. ఆ గడువు నిన్నటితో ముగిసింది. పొడిగింపు కోసం ఏపీ ప్రభుత్వం నాలుగు నెలల నుంచి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు నిలిపివేయాలంటూ.. కేంద్రంపై ఒడిషా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఓ వైపు ఒడిషా ఒత్తిడి..మరో వైపు పనుల కొనసాగింపు విషయంలో కేంద్ర నిర్లక్ష్యం కలిపి చూస్తూంటే.. పోలవరం నిర్మాణానికి బ్రేక్ పడినట్లేనన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
నిజానికి పోలవరం ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఎప్పుడో వచ్చాయి. అయితే తమ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో సరిగ్గా ప్రజాభిప్రాయసకేరణ చేయలేదంటూ.. ఒడిసా, ఛత్తీస్‌గఢ్ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశాయి. దీంతో ఎన్జీటీ 2015 చివరిలో పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జావడేకర్ ఆ ఆదేశాలపై 2016లో స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో.. 2017 జూన్ 2వ తేదీ దాకా పనులు కొనసాగించే అవకాశం కలిగింది. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జావడేకర్‌తో మాట్లాడి స్టేను పొడిగించాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగేది. ఇబ్బంది ఉండేది కాదు.
కానీ ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జావడేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు. ఆయన స్థానంలో వచ్చిన మంత్రి స్టే కాలపరిమితిపై పలు సందేహాలు వ్యక్తం చేసి.. చివరకు స్టాప్ ఆర్డర్‌పై స్టేను ఏడాదికే పరిమితం చేశారు. జూలై 2వ తేదీతో స్టే గడువు ముగిసిపోయింది. స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. కేంద్రమంత్రి హర్షవర్దన్ కు నేరుగా చంద్రబాబు రెండుమూడు సార్లు ఫోన్ చేశారు. ఆదేశాల కోసం వారం రోజులుగా అధికారులు ఢిల్లీలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ స్టే ఆర్డర్ కొనసాగింపు రాలేదు. మరో వైపు ఇదే సమయంలో ఒడిషా సీఎం కేంద్రంపై పోలవరాన్ని నిలిపివేయాలంటూ ఒత్తి చేస్తున్నారు.
ప్రస్తుతం ముందస్తు ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలో.. చంద్రబాబు… కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒడిషా సీఎం సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఒడిషాలో బీజేపీకి రాజకీయ ఆసక్తులు ఉన్నాయి. కానీ ఏపీలో లేవు. అందుకే కేంద్రం పోలవరం పనులపై స్టే ఆర్డర్‌ను పొడిగించేందుకు ఆలస్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఏపీకి బీజేపీ మరోసారి నమ్మక ద్రోహం చేసినట్లే..!