కత్తి మహేష్ అనే మీడియా మేడ్ సెలబ్రిటీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. దాదాపు మూడు నెలల పాటు… డైలీ సీరియల్ గా కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్నట్లుగా వివాదం సాగింది. పాపులారిటీ సంపాదించుకోవాలంటే.. పెద్ద వాళ్లనే టార్గెట్ చేసుకోవాలన్న రామ్‌గోపాల్ వర్మ సలహాను పకడ్బందీగా అమలు చేశాడు.. కత్తి మహేష్. పవన్ ఫ్యాన్స్ మైండ్ సెట్ తెలుసు కాబట్టి.. దానికి అనుగుణంగా వ్యవహారం నడిపారు. ఈ ట్రాప్ లో పవన్ కూడా పడిపోయారు. చివరికి పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలు సామాన్యజనంలో చర్చకు రావడానికి కత్తి మహేష్ కారణమయ్యారు ఇవి పూర్తి స్థాయిలో రచ్చ కాక ముందే.. జనసేన వర్గాలు.. కత్తి మహేష్‌తో రాజీ చేసుకున్నాయి. దాంతో అక్కడితో ఓ ఎపిసోడ్ అయిపోయింది.
అయితే ఇదంతా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు గుర్తుంది. పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు.. ప్రజారాజ్యం పార్టీలో .. తన అన్నను మోసం చేసిన వాళ్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నానని.. వారి సంగతి తేలుస్తానని చెబుతూంటారు. అలాగే నాగేంద్రబాబు కూడా.. కత్తి మహేష్ ని గుర్తు పెట్టుకున్నట్లున్నారు. ఈ సారి కత్తి మహేష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు కాబట్టి… మరింత పెద్ద సెలబ్రిటీని టార్గెట్ చేసుకున్నారు. ఆయనే రాముడు. రాముడిపై ఇష్టం వచ్చినట్లు పిచ్చి కూతలు కూయడంతో పోలీసు కేసులు నమోదయ్యాయి. పోలీసులు తీసుకెళ్లి ఓ రాత్రి స్టేషన్ లో ఉంచి విడిచి పెట్టారు.
ఇక్కడే దొరికాడు అనుకున్నారేమో.. నాగబాబు రంగంలోకి దిగారు. కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అసలు రాముడ్ని అన్ని మాటలంటే.. బీజేపీ నేతలు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నించారు. తనను తాను నిజమైన హిందువుగా చెప్పుకుని… కత్తి మీద కసి తీర్చుకునేలా.. బీజేపీ వాళ్లను రెచ్చగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేశారు. కానీ నాగబాబు కాస్తంత లాజిక్ తో ఆలోచించలేకపోయారని .. కొద్దిగా తెలివిగా ఆలోచించే శ్రేయోభిషులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు కత్తి మహేష్ పబ్లిసిటీ కోసం అలాంటి ప్రకటనలు చేశారని.. అందరికీ తెలిసినప్పుడు… స్పందించడం అంటే… ఆయన ట్రాప్‌లో పడటమేనంటున్నారు.
కత్తి మహేష్ .. గతంలో పవన్ కల్యాణ్ ని ఇబ్బంది పెట్టిన కోపం ఉంటే… మరో అవకాశం కోసం చూడవచ్చేమో కానీ… ఇలా అనవసరంగా.. అతని అభిప్రాయాలపై స్పందించడం వల్ల అతనికి లేనిపోని ప్రయారిటీ ఇచ్చినట్లవుతుందంటున్నారు. ఈ విషయంలో మొత్తానికి కత్తి మహేష్ సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో ఆయనపై ఏమైనా కేసులు నమోదైతే.. అవి పెట్టీ కేసులే, కానీ చిరంజీవి ఫ్యామిలీతో పాటు.. సీఎల్పీ నేత జానారెడ్డి, పరిపూర్ణానంత కూడా స్పందించారు. అంటే… ఈ విషయాన్ని ఆయన మరింత పకడ్బందీగా వాడేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.