భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి.. జీవీఎల్ నరసింహారావు… తెలుగుదేశంపై, చంద్రబాబుపై ఆరోపణలు చేయడానికి చాలా విచిత్రమైన భాషను వాడుతూంటారు. ఆయన వాడుక భాషకు చాలా దూరంగా… 30 ఏళ్ల కిందటి.. పత్రికాభాషతో.. మీడియా సమావేశాల్లో విమర్శలు చేస్తూంటారు. మూడు రోజుల కిందట.. విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టి.. ఇదే లాంగ్వేజ్‌లో కొన్ని ఆరోపణలు చేశారు. ఓ కేంద్రమంత్రితో …మరో ఏపీ మంత్రి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని.. ఆ ఆరోపణల సారాంశం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి లోకేష్‌కు ముడిపెట్టారు. ఆ కేంద్రమంత్రి ఎవరు..? రాష్ట్ర మంత్రి ఎవరు..? అన్నదాన్ని ఆయన చెప్పలేదు. అసలు దేని కోసం లాబీయింగ్ చేస్తున్నారో కూడా చెప్పలేదు.
జీవీఎల్ చేసిన ఆరోపణలు .. మీడియాకు కూడా అర్థం అయినట్లు లేవో.. అవన్నీ.. బురదజల్లుడు ఆరోపణలు అనుకున్నారో కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇది ఆ నోటా ఈ నోటాపడి లోకేష్ వద్దకు వెళ్లినట్లుంది. దీంతో లోకేష్… జీవీఎల్‌పై మండిపడ్డారు. ట్విటర్ వేదికగా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. అబద్దాలు, జుమ్లాలతో.. బతికేస్తున్నారని మండిపడ్డారు. కొంత మంది నిజాలు చెబుతూంటారు. మరికొంత మంది అబద్దాలనే నిజాలుగా చెబుతూంటారు. ఈ రెండో జాబితాలోకే… జీవీఎల్ వస్తాడంటూ విమర్శించారు. దమ్ముంటే…. జీవీఎల్ తనకు లింక్ పెట్టి ఆరోపించిన మంత్రి, కేంద్రమంత్రి పేర్లు బయటపెట్టాలని చాలెంజ్ చేశారు. దీనికి జీవీఎల్ కూడా వెంటనే రిప్లయ్ ఇచ్చారు. త్వరలోనే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి అన్నీ బయటపెడానని ప్రకటించారు. తను చేసిన ఆరోపణలపై స్పందించడానికి 36 గంటల సమయం పట్టిందని సెటైర్ వేశారు.
అయినా జీవీఎల్‌కు అంటే అదే పని.. మంత్రిగా లోకేష్‌కు చాలా పనులుంటాయి కదా..! అయినా జీవీఎల్ చేసే ఆరోపణలు ఏమిటో.. అర్థం చేసుకోవడానికి బాగా టైం పడుతుందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఓ కేంద్రమంత్రితో కూడా లింక్ పెట్టినప్పుడు.. త్వరలో అని…ఇంకోటని చెప్పడం ఎందుకు పేర్లే బయటపెట్టవచ్చు కదా అని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. మరి జీవీఎల్ ఎప్పుడు విజయవాడ వస్తారో.. ఎప్పుడు కొత్త విషయం బయటపెడతారో వేచి చూడాల్సిందే.. !