ప్రతి కెమెరామెన్‌కీ ఒక్కసారైనా మెగా ఫోన్ పట్టాలనిపిస్తుంది. ఎందుకంటే దర్శకత్వంలోని కిటుకులు అందరికంటే వాళ్లకే బాగా తెలుస్తాయి. సెంథిల్ కూడా కెమెరా మెన్ ఛైర్ నుంచి కెప్టెన్ కుర్చీలో కూర్చోవాలని ఆశ పడినవాడే. బాహుబలి 2 తరవాత… ఓ సినిమాకి దర్శకత్వం వహించాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాడు. 2018 – 2019లలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పాడు. అయితే… ఈ నిర్ణయాన్ని ప్రస్తుతం వాయిదా వేశాడు సింథిల్. దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చాడు. ”దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యత. బాగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకోవాలి. పైగా నేను పనిచేయాల్సిన దర్శకుల జాబితా పెద్దదే ఉంది. శంకర్, మణిరత్నం, రాజ్ కుమార్ హిరాణీ, సంజయ్ లీలా బన్సాలీ వీళ్లందరితోనూ సినిమాలు చేయాలి. ఆ తరవాతే.. దర్శకత్వం గురించి ఆలోచిస్తా” అంటున్నాడు. తాను కెమెరామెన్‌గా పని చేసిన ‘విజేత’ ఈనెల 12న వస్తోంది. మెగా అల్లుడు కల్యాణ్‌దేవ్ నటన బాగుందని, కొత్తలో కాస్త తడబడినా.. ఆ తరవాత మెల్లగా పుంజుకున్నాడని, తనకు మంచి భవిష్యత్తు ఉందని కితాబిచ్చాడు ఈ టాప్ కెమెరామెన్.