కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై తెలుగుదేశం సర్కారు తీవ్రంగానే స్పందించబోతోంది. ఆంధ్రాకి చేసేదేం లేదంటూ కేంద్రం అఫిడవిట్ రూపంలో సుప్రీం కోర్టుకు నివేదించిన తీరుపై… ఏపీ సర్కారు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలోని కొంతమందితో చర్చించి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. శుక్రవారం క్యాబినెట్ భేటీ ఉంది. నిజానికి ఈ అంశం చర్చల అజెండాలో లేదు. కానీ, ఇదో అత్యవసర అంశంగా ఉంది కాబట్టి అఫిడవిట్ పై చర్చించి, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం అఫిడవిట్ రూపంలో కోర్టుకు ఇచ్చిన సమాచారమంతా తప్పుల తడకనీ, అవాస్తవాలను తెలిజేయడం ద్వారా న్యాయస్థానాన్ని కూడా తప్పుతోవ పట్టిస్తోందనే కోణంలో కౌంటర్ దాఖలకు ఏపీ సర్కారు సిద్ధం కాబోతోంది. దీనిపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై క్యాబినెట్ లో ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది.
ఇక, ఇదే అంశంపై రాజకీయంగా వినిపిస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే ప్రయత్నమూ చేస్తోంది. ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల తీరుపై కూడా టీడీపీ తీవ్రంగానే స్పందించబోతున్నట్టు సమాచారం. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇంత స్పష్టంగా కేంద్రం చెబుతూ ఉంటే… దీనిపై జగన్, పవన్ లు ఎందుకు ధీటుగా స్పందించలేకపోతున్నారు, భాజపా విషయంలో ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నారనే అంశాన్ని బలంగా వినిపించాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీల విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుంటే… ఈ రెండు పార్టీలూ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు, తాజా అఫిడవిట్ విషయంలో ఈ పార్టీల వ్యవహార శైలిపై ఎలా స్పందించాలనే అంశాన్ని కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించి, వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదనీ… దీనిపై న్యాయపోరాటానికి సిద్ధం కావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. సుప్రీం కోర్టుకు భాజపా సర్కారు సమర్పించిన అఫిడవిట్ లోని అవాస్తవాలపై అధ్యయనం చేసి, న్యాయపోరాటానికి వెళ్లడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచినట్టు అవుతుందని టీడీపీ భావిస్తోంది. టీడీపీ వైఖరి వల్లనే రాష్ట్రానికి ఇబ్బందులు అనే అంశంతో పదేపదే విమర్శలు చేస్తున్న వైకాపా, జనసేనలకు కూడా కౌంటర్ ఇవ్వబోతున్నారు.