జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేశం కాస్తా ఫ్రస్ట్రేషన్గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో రెండో విడత పోరాటయాత్ర ప్రారంభించిన తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్… అందరూ అనుకుంటున్నారంటూ… ఏ మాత్రం పసలేని ఆరోపణలు చేస్తూండటంతో .. ఇప్పటికే ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. మొదట్లో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించేవారు. ఆధారాలు లేని ఆరోపణలని.. క్షమాపణలు చెప్పాలని.. లీగల్ నోటీసులు కూడా జారీ చేసేవారు. కానీ పవన్ కల్యాణ్.. ఎక్కడికి వెళ్లినా అవే ఆరోపణలు.. చేస్తూండటంతో.. మిగతా వాళ్లు.. ఓ సారి కౌంటర్ ఇచ్చి లైట్ తీసుకోవడం ప్రారంభించారు. ప్రజల్లో కూడా ఇదే తరహా అభిప్రాయం ఏర్పడింది.
దీంతో తాను ఎంత సీరియస్ ఆరోపణలు చేస్తున్న ప్రజల్లో ఏ మాత్రం స్పందన లేదని పవన్ కల్యాణ్ ఫీలవుతున్నారో ఏమో కానీ.. ఇప్పుడు దానికి ఫస్ట్రేషన్ జత చేస్తున్నారు. పెందుర్తిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు.. ” ఎమ్మెల్యే కొడుకులు జాగ్రత్త” అని హెచ్చరికలు జారీ చేసేశారు. ఆ తర్వాత ముదపాక అనే గ్రామంలో భూముల పరిశీలనకు వెళ్లి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై అంతకు మించి వ్యాఖ్యలు చేశారు. ” చొక్కా పట్టుకుని రోడ్లపైకి తీసుకువస్తామంటూ..” తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. సాధారణంగా బండారు సత్యనారాయణమూర్తి ఎవరిపైనైనా విమర్శలు చేయాల్సి వస్తే చాలా తీవ్రంగా స్పందిస్తారు. పవన్ కల్యాణ్ విషంలోనూ అంతే స్పందించారు. కానీ పాపం పవన్ కల్యాణ్ అన్నట్లు ఆయన వ్యవహారశైలి ఉంది. పెట్రోయూనివర్శిటీ భూముల విషయంలో పవన్ చేసిన ఆరోపణలను.. ఆయన…చాలా తేలిగ్గా తీసుకున్నారు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే…తనకు. తన కుమారుడికి లింక్ పెట్టడం .. అమాయకత్వమేనని తేల్చారు.
అయితే పవన్ ఫ్రస్ట్రేషన్ ను బండారు చాలా పకడ్బందీగా వాడుకున్నారు. ప్రజాసేవ చేస్తానని చెప్పి వచ్చి చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ఇలాంటి మాటలే మాట్లాడారు. గుడ్డలూడదీసి కొడతాం. చొక్కాలు పట్టుకుంటాం..లాంటి డైలాగులు సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో ఆరాచకానికి ప్రతీకలుగా ఉంటాయి. ప్రజలు ఎప్పుడూ అరాచకానికి స్థానం ఇవ్వనే ఇవ్వరు. ప్రసంగించినప్పుడు ఆ డైలాగులు విని… ఫ్యాన్స్ చప్పట్లు కొడతారు తప్ప.. ప్రజల్లో తన ఇమేజ్ ను పెంచవు. పైగా చులకన చేస్తాయి.
పవన్ కల్యాణ్ సినిమా డైలాగులకు….రాజకీయ ప్రసంగాలకు తేడా తెలుసుకోలేకపోతే… ఆయన ప్రజల్లో రాజకీయాల్లో నటిస్తున్న ఓ నటుడిగానే ప్రజలకు గుర్తుండిపోతారు. ఆయన చూపించే ఆవేశం.. చేసే ఆరోపణలకు.. ఒకటి రెండు ఆధారాలనైనా.. బయటపెడితే.. ప్రజల్లో కాస్తంత నమ్మకం వస్తుంది. కానీ పవన్ కల్యాణ్ అవినీతి రశీదులివ్వరంటూ ..తప్పించుకుంటున్నారు. అలాంటప్పుడు.. చొక్కా పట్టుకుంటాం.. చితక్కొడతాం..అనే డైలాగులు చెప్పకూడదేమో..? ఆధారాలు చూపిస్తే.. ప్రజలే చూసుకుంటారు.. చొక్కాలు పట్టుకోవాలో..మరేమైనా పట్టుకోవాలో.. లేకపోతే.. పవన్ కల్యాణ్ మరింత చులకనైపోతారు.
——సుభాష్