“నీకు ఇంకా పెళ్లి కాలేదా..” అని ఆశ్చర్యపోతాడు..ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని చూసి. తన స్నేహితుడి ఫీలింగ్ చూసి.. సిగ్గుతో చచ్చిపోయి..కవర్ చేసుకోవడానికి.. “కాలేదు కాదు.. చేసుకోలేదు..” అంటాడు అతను. అచ్చంగా ఇప్పుడు తెలంగాణ బీజేపీ పరిస్థితి కూడా ఇంతే ఉంది. పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. చేయాల్సింది ఒంటరి పోటీనే. ఆ విషయం తెలిసి కూడా.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఎవరు అడిగినా.. అడగకపోయినా… మేము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
2009 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఒక్క కిషన్ రెడ్డి మినహా.. తెలంగాణ బీజేపీలోని ఏ దిగ్గజ నేతా.. కనీసం డిపాజిట్ల దాకా రాలేకపోయారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కలసి వచ్చింది. గ్రేటర్ పరిధిలో మాత్రం ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత నుంచి బీజేపీ తీరులో తేడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడే.. మాది ఒంటరి పోటీ అంటూ ప్రకటనలు చేసేసుకున్నారు. చివరికి వారి కోరికను టీడీపీ తీర్చింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు టీడీపీ-బీజేపీ మధ్య వ్యవహారం ఉప్పునిప్పులా ఉంది.
ఇక తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, వామపక్షాలు ఉన్నాయి. వీటిలో ఒక్కదానికైనా బీజేపీ పొడ గిడుతుందా..?. అవకాశమే లేదు. కావాలంటే టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి మిగతా పార్టీలన్నీ… మహాకూటమిగా అయినా మారతాయి కానీ… బీజేపీని మాత్రం దగ్గరకు రానివ్వవు. టీఆర్ఎస్ మాత్రమే బీజేపీతో అంతో ఇంతో పొత్తు పెట్టుకునే చాన్స్ ఉన్న పార్టీ. కానీ అ పొత్తు ఏమైనా ఉంటే.. ఢిల్లీకే పరిమితమవుతారు కానీ… గల్లీలోకి తెచ్చేందుకు కేసీఆర్ అస్సలు అంగీకరించరు. అందులో ఎలాంటి సందేహం లేదు.
అంటే .. బీజేపీ ఒంటరిగా పోవాల్సిందే. నేను పొత్తు పెట్టుకుంటా అని వెంటపడినా.. ఎవరూ దగ్గరకి కూడా రానీయరు. సీన్ ఇలా ఉంటే… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం తమకు చాలా సంబంధాలు వస్తున్నాయి.. కానీ ఒంటరిగానే ఉంటానంటూ కవర్ చేసుకుంటున్నారు.