తనయుల్ని హీరోలుగా నిలబెట్టడానికి తండ్రులంతా పాటు పడుతున్నారు. మావయ్యలు అల్లుళ్లనీ, మేనళ్లుళ్లనీ ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ బ్రహ్మానందం మాత్రం ఈ విషయంలో ఇంకా మేలుకోలేదు. తన ఇంట్లో ఓ హీరో ఉన్నాడు. పేరు.. గౌతమ్. ఒకట్రెండు సినిమాలు చేసినా ఫలితం రాలేదు. తన సినిమాల్లో పబ్లిసిటీలోపం ప్రధానంగా కనిపిస్తుంటుంది. బసంతి సినిమాకి బ్రహ్మానందం మేల్కొని కాస్తో కూస్తో పబ్లిసిటీ తీసుకురాగలిగాడు. బ్రహ్మానందం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తే… పబ్లిసిటీ విషయంలో లోటు ఉండదు. కానీ ఆయనేమో మహా జాగ్రత్త పరుడు. రూపాయి తీయాలంటే పది రకాలుగా ఆలోచిస్తాడు.
గౌతమ్ కొత్త సినిమా ‘మను’ విడుదలకు సిద్ధమైంది. పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. ఈ సినిమానీ బ్రహ్మానందం చూసీ చూడనట్టు వదిలేస్తాడో, లేదంటే తనయుడ్ని నిలబెట్టడానికి కాస్తో కూస్తో డబ్బులు తీసి పబ్లిసిటీ చేస్తాడో చూడాలి. బ్రహ్మానందం పిలిస్తే.. చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకూ అందరూ వస్తారు. అదీ ఫ్రీగానే. ఈ విషయంలో డబ్బులు పెట్టక్కర్దెద్దు. అయితే టీవీ ఛానళ్లలోనూ, పేపర్లలోనూ యాడ్లు ఇవ్వాలంటే, భారీగా ప్రమోషన్లు చేయాలంటే లక్షలు లక్షలు కావాలి. చిన్న సినిమాలకు అంత స్థోమత ఉండదు. బ్రహ్మానందం తన వంతు బాధ్యతగా ముందుకొస్తే తప్ప… ‘మను’కి పబ్లిసిటీ దక్కదు. ఈసారి బ్రహ్మానందం ఏం చేస్తాడో..?