పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు వస్తుంటే వైకాపా నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. పట్టిసీమపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆల్మట్టీకి ఇంకా నీరు రాలేదనీ, కానీ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వడం మనకు సాధ్యమైందన్నారు. ఒక బేసిన్ నుంచి మరో బేసిన్ కు నీరు తరలించడం రికార్డు అనీ, పట్టిసీమ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటే వైకాపా అధినేత జగన్ కు వినిపించడం లేదని మంత్రి విమర్శించారు. గోదావరి మీదుగానే పాదయాత్ర చేసుకుని వెళ్తున్న జగన్, పోలవరం ప్రాజెక్టును ఎందుకు సందర్శించకుండా వెళ్లిపోయారని ప్రశ్నించారు.
నిజమే కదా…! పోలవరం ప్రాజెక్టుకు జగన్ వెళ్లి ఉంటే బాగుండేది. ఆ పార్టీ అభిమానులకు మంచి ఊపు వచ్చేది. ఎందుకంటే, ఆ ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరిగిపోయిందనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జరిగిన పనులు ఏవీ లేవని జగన్ విమర్శిస్తుంటారు కదా. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో వందలకోట్లు కమిషన్లను చంద్రబాబు తీసుకున్నారని తరచూ ఆరోపిస్తుంటారు. అంతేకాదు, పోలవరంలో జరిగిన చాలా పనులు వైయస్సార్ హయాంలోనే జరిగినవనీ చెప్పుకుంటూ ఉంటారు. కనీసం తన తండ్రి హయాంలో జరిగిన పనులు ఇవీ అని చూపెట్టుకోవడానికైనా వెళ్తే బాగుండేది. పాదయాత్రలో భాగంగా పోలవరం సందర్శించి, అక్కడో సభ పెట్టి ఉంటే బాగుండేది. అవినీతికి సంబంధించి తమ దగ్గర చాలా ఆధారాలున్నాయంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు కదా! అన్నీ అక్కర్లా.. ఒకటో రెండో పోలవరంలోనే బయటపెడితే పార్టీకి మరింత మైలేజ్ వచ్చేది.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఆ మధ్య వైకాపా నేతలు ఓ బస్సులో వెళ్లారు. అక్కడి పనులు సమీక్షించి.. పనులేవీ జరగలేదంటూ విమర్శలు చేశారు. నిజానికి, అక్కడ జరుగుతున్న పనుల గురించి ఇంజినీర్లు కొంతమంది వివరించినా.. వాటిలోని సాంకేతికత వైకాపా నేతల్లో చాలామందికి అర్థంకాలేదన్న విమర్శలూ వచ్చాయి! డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో వైకాపా నేతలకు తెలీడం లేదనీ, భూమి లోపల ఉంటుందన్న అవగాహన లేనివారు తనను విమర్శిస్తారంటూ అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా విమర్శించారు. వైకాపా నేతల పోలవరం బస్సుయాత్రకి అప్పట్లో అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. కనీసం, ఇప్పుడు పాదయాత్రలో ఉన్న జగన్ కూడా అవకాశాన్ని జారవిడుచుకున్నట్టవుతోంది. వచ్చే ఎన్నికల ప్రచారంలో కూడా పోలవరం ప్రాజెక్టులో అవినీతి అంశాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా వైకాపా వాడుకుంటుంది. అలాంటప్పుడు, ఆ ప్రాజెక్టు దగ్గరకు జగన్ వెళ్లకపోతే… పోలవరం చూడకుండా జగన్ దాటాశారే ఇలాంటి విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.