మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ గుర్తుంది కదా? అందులో సత్యరాజ్ ది ‘అందరూ కలసి ఉండాలి’ అనే సిద్దాంతం. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, వాళ్ల పిల్లలు… ఇలా ఉమ్మడిగా ఉండాలనుకుంటాడు. అందుకోసం కథానాయకుడు ఏం చేశాడన్నది కథ. ఇప్పుడు కార్తి నటించిన ‘చినబాబు’ ట్రైలర్ చూస్తున్నా.. ఆ కాన్సెప్ట్ కి కాస్త దగ్గరగా ఉందనిపిస్తోంది. ఇక్కడా హీరో నాన్న… సత్యరాజే. `కుటుంబమంతా కలసి గ్రూప్ ఫొటో తీసుకోవాలి` అంటూ కలలు కంటుంటాడు. అందుకోసం చుట్టాల్ని పోగేసే పనిలో పడతాడు కార్తి. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటి వరకూ ఇదో రైతు కథ… రైతు కథ అని ప్రచారం చేశారు. మరీ రైతుల కథంటే సందేశాత్మక చిత్రం అని ప్రేక్షకుల భావించి థియేటర్లకు రావడం మానేస్తారని.. ఆ గొడవేం లేకుండా ట్రైలర్ కట్ చేశారు. కంచెలు, తెల్ల బొట్లు చూస్తుంటే.. తెలుగు నేటివిటీ గురించి ఏమాత్రం పట్టించుకోలేదనిపిస్తోంది. సూరి కామెడీ కూడా.. పూర్తిగా అరవ వాసనే కొడుతోంది. పాండిరాజ్ కి దర్శకుడిగా మంచి పేరుంది. కార్తికి తెలుగులో మార్కెట్ ఉంది. ఇవి రెండే చినబాబుకి అండా దండ.