తెలుగు ప్రేక్షకుల ముందుకు గురువారం గోపీచంద్ ‘పంతం’, శుక్రవారం సాయిధరమ్ తేజ్ ‘తేజ్’ సినిమాలు వచ్చాయి. హీరోలు ఇద్దరూ తమ తమ ఖాతాల్లో విజయవంతంగా చెరో ఫ్లాపునీ వేసేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే… సంగీత దర్శకుడు గోపిసుందర్ ఈ ఒక్క వారమే తన ఖాతాలో రెండు ఫ్లాపులను జమ చేసుకున్నాడు. ఈ రెండిటికీ ఇతడే సంగీత దర్శకుడు కదా మరి!
గత నెలలో వచ్చిన శ్రీనివాసరెడ్డి ‘జంబ లకిడి పంబ’కీ ఇతడే సంగీత దర్శకుడు. అదీ ఫ్లాపే. అంతకు ముందు రాజ్ తరుణ్ ‘రాజుగాడి’తో, సునీల్ ‘టు కంట్రీస్’తోనూ గోపి సుందర్ ప్లాపులను మూటగట్టుకున్నాడు. కొన్ని సినిమాలు ప్లాప్ అయినా వాటిలో పాటలు హిట్ అవుతాయి. పైన చెప్పుకొన్న సినిమాల్లో ఒక్క హిట్ పాట చెప్పమంటే ప్రేక్షకులు ఎవరూ చెప్పలేరు. సినిమాలతో హీరోలు, పాటలతో సంగీత దర్శకుడిగా గోపి సుందర్ ప్లాపులు అందుకున్నారు.
‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు ‘తో గోపిసుందర్ తెలుగులో అడుగు పెట్టాడు. తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘ఊపిరి’, ‘మజ్ను’, ‘నిన్ను కోరి’ సినిమాలకు మంచి పాటలు ఇచ్చాడు. తర్వాత సినిమాలకు మాత్రం సరిగా చేయలేదు.