ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల హడావుడితో కనిపిస్తున్నాయి. టీడీపీ, వైకాపా, జనసేనలు ఎన్నికల ప్రచారం తరహాల్లో యాత్రలూ పర్యటనలూ సభలతో హోరెత్తిస్తున్నాయి. ఏపీలో పునర్వైభవం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీలో కూడా ఇకపై కొంత హడావుడి వాతావరణమే నెలకొనబోతోంది. ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కొన్ని కీలక జిల్లాల్లో పర్యటించబోతున్నారు. గతంలో పార్టీ వీడి వెళ్లిన నాయకుల్ని తిరిగి పార్టీలోకి వచ్చేలా ఆహ్వానించడమే ఈ పర్యటనలో ప్రధానాంశంగా ఉండబోతోంది.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు చేపట్టగానే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడంలో ఉమెన్ చాందీ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఈనెల 13న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో నల్లారి పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని సమాచారం. ఇదే ఊపును కొనసాగించేందుకు ఈ నెల 9 నుంచి 12 వరకూ తొలి విడత పర్యటన చేయబోతున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉమెన్ చాందీ పర్యటిస్తారు. ఈ జిల్లాల్లో ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై స్థానిక నేతలతో చర్చిస్తారు. ఈ జిల్లాల నుంచి గతంలో పార్టీలో ప్రముఖంగా ఉన్న నేతల జాబితా తయారు చేసుకుని, వారితో ఒక్కొక్కరిగా భేటీ అయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. వీటితోపాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆయన స్వయంగా పర్యటించి, ఇదే తరహాలో నేతల వివరాలు, పార్టీ తాజా పరిస్థితులపై అవగాహన కల్పించుకోవడంతోపాటు, నాయకుల్ని ఆహ్వానించే ప్రక్రియను వేగవంతం చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రాలో కాంగ్రెస్ ను మరోసారి నిర్ణయాత్మక శక్తిగా మార్చేందుకు ఈ పర్యటనలు ఉపయోగపడతాయని ఏఐసీసీ వర్గాలు ధీమాగా ఉన్నాయని సమాచారం. అయితే, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తరహాలో ఒకప్పటి నేతలు వచ్చి చేరే అవకాశం ఎంతవరకూ ఉంటుందా అనేది ప్రశ్న..! ఎందుకంటే, రాష్ట్ర విభజన తరువాత నల్లారి తటస్థంగా ఉండిపోయారు. ఇతర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయారు. తటస్థంగా ఉన్న నాయకులు మళ్లీ కాంగ్రెస్ లోకి రావడం వేరు, ఇతర పార్టీల్లో పదవులను అనుభవిస్తున్నవారు పార్టీలోకి తిరిగి రావడం వేరు! ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటనేది ప్రస్తుతానికి అగమ్యగోచరంగానే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ వీడి వెళ్లినవారందరినీ ఉమెన్ చాందీ కలవబోతూ ఉండటం కొంత ఆసక్తికరంగానే కనిపిస్తోంది. కానీ, ఆయన పిలుపు వినగానే పార్టీలోకి తిరిగి వచ్చి చేరేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో అనేదే చూడాలి.