“నేను నిన్ను కొట్టినట్లు నటిస్తా…నువ్వ ఏడ్చినట్లు నటించు” అన్న ఒప్పందం ఇప్పుడు.. తెలంగాణలో టీఆర్ఎస్ – బీజేపీల మధ్య నడుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ బస్సుయాత్ర ప్రారంభించి.. కేసీఆర్ నే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మధ్య మధ్యలో కేంద్రమంత్రులు వచ్చి మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ వచ్చి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మగతనం లేని వాళ్లుగా విమర్శించి ఈ విమర్శల రేంజ్ ని పెంచారు. రామ్మాధవ్పై టీఆర్ఎస్ నేతలు.. ఒక్కసారిగా రెచ్చిపోయారు. దీంతో… టీఆర్ఎస్, బీజేపీ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా మారిపోయింది అని అనుకుంటున్నారు.
కానీ అంతా పొలిటికల్ జిమ్మిక్కేనన్న సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ పోరాటానికి దిగడానికి ఓ ఫార్ములాను రెండు పార్టీలు రెడీ చేసుకున్నాయి. ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఇప్పుడు స్క్రీన్ ప్లే నడుస్తోందంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే… బీజేపీ పెరిగితే టీఆర్ఎస్ కు లాభం. ఎలా అంటే బీజేపీ ఎంత బలపడితే… టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అంత చీలుతుంది. బీజేపీ విడిగా టీఆర్ఎస్ పై పోరాడితే… ప్రభుత్వానికి వ్యతిేరకంగా ఓటు వేయాలనుకునేవారు కొంత మంది బీజేపీ వైపు మొగ్గుతారు. అలాగే బీజేపీ నేతలు టీఆర్ఎస్ను తిట్టినంత కాలం.. ముస్లింల మొగ్గు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఎంఐఎం టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది. దీని వల్ల ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఉంటాయి.
కొద్ది రోజులుగా బీజేపీతో టీఆర్ఎస్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. దీంతో ముస్లిముల్లో అనుమాన మేఘాలు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ కు ఓటేస్తే. పోయి పోయి బీజేపీకి ఓటేసినట్లేనన్న అభిప్రాయం ముస్లిం వర్గాల్లో పెరుగుతోంది. దీనికి విరుగుడుగా.. బీజేపీతో తీవ్రమైన శతృత్వం ఉందన్నట్లుగా.. ఇప్పుడు సీన్ క్రియేట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బీజేపీకి ఇప్పుడు జాతీయ అవసరాలు చాలా ముఖ్యం. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే.. దక్షిణాదిలో సమకూర్చునే సీట్లే దానికి ఆధారం. అందుకే విభిన్న వ్యూహాలను బీజేపీ అమలు చేస్తోందని చెప్పుకోవచ్చు.
జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ వద్ద.. కేసీఆర్ కు లభిస్తున్న ప్రాధాన్యం.. రాష్ట్రంలో జరుగుతున్న పోరాటం విశ్లేషిస్తే… రెండు రకాల అంశాలు మన కళ్ల ముందు ఉంటాయి. ఒకటి… టీఆర్ఎస్ సొంతంగా పార్లమెంట్ సీట్లను గెలుచుకునే ప్రయత్నం చేస్తుందనుకోవడం. ఇది సాధ్యమవుతుందన్న నమ్మకం చాలా తక్కువ. రెండోది.. వీలైనంతగా బలపడి.. అధికార వ్యతిరేకత ఓట్లను చీల్చడం… ఈ వ్యూహమే అమలు చేస్తున్నారన్న అంచనాలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.