జనసేన అధినేత మరో చిత్రమైన ప్రకటన చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ…లంచాలు తీసుకుంటే.. రసీదులిస్తారా ఏమిటి… సాక్ష్యాలు చూపెట్టడానికి అంటూ.. తనకు మాత్రమే సాధ్యమైన వాదన వినిపిస్తూంటారు. అచ్చంగా అలాగే.. ఇప్పుడు రైల్వేజోన్ విషయంపై పోరాడే విషయంలోనూ… ప్రకటన చేశారు. చంద్రబాబు, జగన్ తన వెనుక వస్తే.. రైల్వేజోన్ కోసం కేంద్రంపై పోరాడటానికి సిద్ధమంటూ ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ అవగాహనా రాహిత్యానికి ఈ ప్రకటన మరో ఉదాహరణగా నిలిచింది. రైల్వేజోన్ విషయంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. సరే.. జనసేన అధినేత ఉద్దేశంలో పోరాడటం లేదనుకుందాం.. కనీసం పోరాడుతున్నట్లు ప్రజల ముందు కనిపిస్తోంది కదా. మరి జనసైన వైపు నుంచి అలాంటి ప్రయత్నాలు కూడా ఎందుకు జరగలేదు.
ఉత్తరాంధ్ర వెనుకబాటు అంటూ.. దాదాపు నెల రోజుల పాటు.. పర్యటించి.. అనేక అంశాలపై ఉద్రేకపూరిత ప్రసంగాలు.. ప్రజలను రెచ్చగొట్టే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని జనసేన అధినేత.. రైల్వే జోన్ విషయంలో ఒక్క మాట కూడా ఎందుకు మట్లాడలేదు..? ఇప్పుడు.. చంద్రబాబు, జగన్ కలసి వస్తేనే పోరాటం చేస్తానంటే అర్థం ఏమిటి..?. జనసేన వైపు నుంచి కేంద్రాన్ని ప్రశ్నించేలా ఒక్క ప్రకటన కూడా చేయలేదు ఇప్పటి వరకూ…!. అయినా చంద్రబాబు, జగన్ కలసి రావాలని పిలుపునివ్వడం దేనికి సంకేతం..?. నరేంద్రమోడీపై పోరాటానికి పవన్ కల్యాణ్ భయపడుతున్నారని అర్థమా..?. తనకు వారు సపోర్ట్ గా ఉంటేనే పోరాడతానంటే.. జనసేనకు జనం బలం, పట్టుదల లేవని అర్థమా..?. ప్రత్యేకహోదా సహా ఏ ఒక్క విభజన హామీపై నోరు మెదపని పవన్ కల్యాణ్.. అందరూ కలసి రావాలని అంటే వచ్చేస్తారా..?
ముందు పోరాటం చేసి.. జనసైనికుల సాయంతో.. కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే కొంచెమైనా పవన్ కు చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు కానీ..మోడీని ఆది గురువుగా చెప్పుకుంటూ… ఆయనపై పోరాటానికి నా వెనుక రండి అంటే ఎలా ఉంటుంది..? అయినా రాజకీయాల్లో ఒక పార్టీ వెనుక మరో పార్టీ ఎప్పుడూ వెళ్లదు. ఎవరి పోరాటం వాళ్లు చేయాల్సిందే. విడివిడిగా చేసిన రాష్ట్రం కోసం చేయాల్సిందే. కానీ ఏపీలో .. ఒక్క అధికార పార్టీ మాత్రమే పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీతో పాటు జనసేన కూడా.. ఏపీ ప్రభుత్వంపైనే పోరాటం చేస్తున్నారు. ఈ విషయం స్పష్టంగానే ఉండగా.. తన నిస్సహాయతను కప్పిపుచ్చుకునేందుకు పవన్ కల్యాణ్ మరో విచిత్రమైన ప్రకటన చేశారు. అయినా జనసేన ప్రజా పోరాయయాత్రను ఒక్కడే చేసుకుంటున్నారు కదా..! ఇతర పార్టీలేవీ కలసి రావట్లేదు కదా..! పవన్ కల్యాణ్.. మరి రైల్వేజోన్ పోరాటంలో.. చంద్రబాబు, పవన్ ఎందుకు వెనుక రావాలి..?