సినిమాలు వివాదాలకు సాఫ్ట్ టార్గెట్ అవుతూంటాయి. ఇటీవలి కాలంలో మనోభావాల పేరుతో సినమాల మీద దాడి చేసే ఘటనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా.. విడుదలకు ముందో.. ఆ తర్వాతో.. ఏదో ఓ వివాదం వస్తూనే ఉంది. సినిమాలో మంచిగా చూపించినా.. తమ కులం ప్రస్తావన ఉందని.. మతం ప్రస్తావన ఉందని..వర్గం ప్రస్తావన ఉందని.. రెచ్చిపోయేవారు పెరిగిపోతున్నారు. చెడుగా చూపించలేదు మహా ప్రభో అని ఫిల్మ్ మేకర్లు అరిచి గీ పెట్టుకున్నా.. వారు వినడం లేదు. ఎలాగూ అలాంటి వారిని ఎంకరేజ్ చేయడానికి ఎలక్ట్రానిక్ మీడియా రెడీగా ఉంటుంది.
తాజాగా .. కమల్ హాసన్ సినిమా ” శభాష్ నాయుడు..” పై కూడా ఇలాంటి వివాదమే తమిళనాడులో లెవనెత్తారు. తమిళంలో కూడా.. సినిమా పేరు ” శభాష్ నాయుడు”నే. ఈ సినిమా పేరులో కులం ఉందని..కచ్చితంగా పేరు మార్చాల్సిందేనని కొన్ని గ్రూపులు కమల్ హాసన్‌ను బెదిరించడం ప్రారభించాయట. సినిమాను అడ్డుకుంటామని కూడా.. కుల సంఘాల పేరుతో కొంత మంది కమల్‌ను.. బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. కమల్ హాసన్ రాజకీయ పార్టీని కూడా ప్రారంభించడంతో .. ఆయన సినిమాలపై ఇంకా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. తమిళ రాజకీయాలు… ఇలాంటి వాటితోనే ఎక్కువ ముడి పడి ఉంటాయి. కానీ కమల్ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ మార్చను.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అని తేల్చి చెప్పేశారుట.
తెలుగులోనూ… కమల్ సినిమా శభాష్ నాయుడు పేరుతోనే విడుదలబోతోంది. తమిళంతో పోలిస్తే.. తెలుగులోనే.. ఈ నాయుడు ఎక్కువగా ఓ కులాన్ని సూచిస్తుంది. సినిమా పబ్లిసిటీ ప్రారంభమయ్యేసరికి… ఈ సినిమాకు కులం కోణాన్ని జోడించి… రచ్చ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. వారితో గంటలు గంటలు ఎపిసోడ్లు నడిపించడానికి టీవీ చానళ్లు కూడా రెడీగా ఉంటాయి. గెట్ రెడీ ఫర్.. “శభాష్ నాయుడు” కులం కాంట్రావర్శీ..!