ఇటీవల సూర్య హీరోగా “గ్యాంగ్” అనే సినిమా వచ్చింది. పరిస్థితుల కారణంగా… కొంత మంది “గ్యాంగ్”గా మారి నకిలీ సీబీఐ అధికారుల అవతారం ఎత్తి… అక్రమార్కుల దగ్గర ఉన్నదంతా ఊడ్చుకుపోతూంటారు. ఇది నిజంగానే జరిగిన కథనే. సినిమా టిక్‌గా మార్పులు చేశారు. ఇలాంటి మోసాలకు పెద్ద “గ్యాంగ్” అవసరం లేదని… ఒక్కడినైనా “గ్యాంగ్”గా చేయవచ్చని… నిరూపించాడు.. ఖమ్మం జిల్లాకు చెందిన కారుమంచి సురేష్. నకిలీ సీబీఐ అధికారిగా సురేష్ చేసిన మోసాలు బట్టబయలై.. పోలీసులకు చిక్కడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
కారుమంచి సురేష్ సీబీఐ ఎస్ఐగా చెప్పుకుని ఖమ్మంజిల్లాలో పలువురిని మోసం చేశాడు. పోలీస్, రెవెన్యూ, అటవీశాఖ, సీబీఐలలో ఉద్యోగాల ఆశ చూపి 27 మంది నిరుద్యోగుల నుంచి రూ. 60 లక్షలు వసూలు చేశాడు. నిరుద్యోగులను నమ్మించేందుకు ఏకంగా డీజీపీ, సీఎం, ఎంపీ, రైల్వే జీఎం, సీబీఐ జేడీల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులను తయారు చేశాడు. డబ్బులిచ్చిన వాళ్లకు నియామక పత్రాలు పంపేవాడు. వాటిని పట్టుకుని ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిన వాళ్లకు చేదు అనుభవం ఎదురయ్యేది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేష్ వ్యవహారం బయటకు వచ్చింది.
నిజానికి కారుమంచి సురేష్.. తనే ఓ గ్యాంగ్‌గా మారడానికి… తన జల్సాలో.. డబ్బుల కోసం ఆశ పడటమో కారణం కాదు. తన లవ్ స్టోరీనే కారణం. తను ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని.. ఎలాగోలా అమ్మాయిని పోషిస్తానని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి చెప్పాడు. కానీ.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం.. “ఒకే ఒక్కడు” సినిమాలో హీరోయిన్ తండ్రి చెప్పినట్లు…” గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తా..” అని తేల్చి చెప్పారు. దాంతో.. సురేష్‌కు ఉన్న పళంగా.. ప్రభుత్వ ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలో తెలియలేదు. కానీ ఐడియా మాత్రం వచ్చింది. అంతే తనకు తానే…సీబీఐ ఎస్ఐగా ఉద్యోగం ఇప్పించేసుకున్నాడు. ఎలా వచ్చిందంటే.. డబ్బులతో కొనుక్కున్నానని చెప్పడం ప్రారంభించాడు.
దాంతో నిరుద్యోగులు తమకూ ఉద్యోగం ఇప్పించాలని సురేష్‌ను సంప్రదించడం ప్రారంభించారు. అప్పటికే ఓ సారి తన మోసం సక్సెస్ అవడంతో… వీరిని కూడా బుట్టలో వేయడం ప్రారంభించాడు. వారిచ్చిన డబ్బులు తీసుకుని… ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా.. బయటపడింది. దొరికిపోయాడు. కటకటాలు లెక్కిస్తున్నాడు. తప్పించుకోవడానికి ఇదేమీ సినిమా కాదుగా..!