‘వన్ ఫిల్మ్ వండర్’ అంటుంటారే…. కరుణాకరన్‌ని చూస్తే ఈ మాటే వాడాలనిపిస్తుంటుంది. తొలి అడుగులో తీసిన ‘తొలి ప్రేమ’ ఆల్ టైమ్ సూపర్ హిట్స్ జాబితాలో చేరిపోయింది. ఆ సినిమాతో పవన్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఆ సినిమా తీసిన కరుణాకరన్ మాత్రం ఇంకా ‘తొలి ప్రేమ’ దగ్గరే ఆగిపోయాడు. ఆ తరవాత ఎన్ని సినిమాలు చేసినా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. `తేజ్ ఐ లవ్ యూ` ప్రమోషన్లలో తొలిప్రేమ పేరుని బాగానే వాడుకున్నాడు కరుణాకరన్. ఆ సినిమాలా తేజ్ కూడా పదేళ్ల తరవాత కూడా చెప్పుకునే సినిమాగా మిగులుతుందన్నాడు. కానీ తీరా చూస్తే.. ‘తేజ్’ తొలి రోజే పట్టాలు తప్పినట్టు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు కరుణాకరన్ ప్లేటు మార్చేశాడు. ‘తేజ్’ ఎఫెక్టో ఏమో.. ‘తొలి ప్రేమ’ పేరు చెబితే ఒణుకొచ్చేస్తోందంటున్నాడు. ; తొలి ప్రేమ తీసేటప్పుడు నాకు సినిమా గ్లామర్ తెలీదు. నాకు ఏది అనిపిస్తే అది చేసుకుని వెళ్లిపోయా. ఆ తరవాత… నా దగ్గర్నుంచి వచ్చిన ప్రతీ సినిమానీ తొలి ప్రేమతో పోల్చి చూడడం మొదలెట్టారు. ఓ విధంగా నాపై అది ఒత్తిడి పెంచింది. ఇప్పుడు తొలి ప్రేమ పేరు చెబితే ఒణుకొచ్చేస్తోంది. తొలి ప్రేమ స్థాయిలో ఓ సినిమా తీయాలని ప్రతీసారీ ఆశ పడుతుంటాను. కానీ.. అలాంటి సినిమా ఒక్కసారే వస్తుంటుంది. నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటా. కానీ ప్రేక్షకులు… ఇవ్వాల్సిన బహుమతి అది“ అంటున్నాడు కరుణారన్. `తేజ్`పై వస్తున్న నెగిటీవ్ టాక్‌పై కూడా స్పందించాడు. “విడుదలై ఒక్కరోజే కదా అయ్యింది. మెల్లమెల్లగా పుంజుకుంటుందన్న నమ్మకం ఉంది“ అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కరుణాకరన్… ఏ డిజాస్టర్ లవ్ స్టోరీ!
ప్రేమకథా చిత్రాలు బాగా తీస్తాడని కరుణాకరన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ చాలామంది దర్శకులు ప్రేమకథా చిత్రాలు తీసేటప్పుడు రిఫరెన్స్ గా తొలిప్రేమని వాడుకుంటారు. మరీ ముఖ్యంగా మాంటేజెస్ విషయంలో కరుణాకరన్ స్పెషలిస్టు. తొలి ప్రేమ వచ్చి ఇన్నేళ్లయినా ఆయన లవ్ స్టోరీ జోనర్‌ని వదల్లేదు. అలాంటి కరుణాకరన్‌కి ఓ లవ్ స్టోరీ ఉంది. ఆయన ఓ అమ్మాయిని ప్రేమించాడట. కానీ… వర్కవుట్ అవ్వలేదు. ”నాదో డిజాస్టర్ లవ్ స్టోరీ. ఓ అమ్మాయిని ప్రేమించా. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఇక నాకు ఏ అమ్మాయీ పడదని తెలుసుకుని, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా భార్యని ప్రేమిస్తున్నాను. చాలా ఏళ్ల తరవాత నేను ప్రేమించిన అమ్మాయిని కలిశాను. ఎప్పటికైనా ఈ కథని సినిమాగా తీస్తా” అంటున్నాడు కరుణాకరన్. లవ్ స్టోరీలపై ఎందుకంత మక్కువ? అని అడిగితే.. ”నాకు తెలిసిన జోనర్ అదొక్కటే. అందులోనే కొత్త కొత్త విషయాలు చేర్చాలని చూస్తుంటాను. ఈ జోనర్‌ని దాటి వెళ్లి మరో సినిమా చేయలేను“ అని నిజాయతీగా సమాధానం చెప్పాడు. ఆయన తాజా చిత్రం `తేజ్` కూడా ఓ ప్రేమకథే. కాకపోతే… కరుణాకరన్ ప్రేమ కథలానే.. ఓ విఫల గాథ.