ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి… ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో తిరుగులేని ముద్ర వేసుకున్న నాయకుడు. ఏపీ రాజకీయాల్లో తనదైన సమర్థ పాలన సాగించిన అతి తక్కువ ప్రభావవంతమైన ముఖ్యమంత్రుల్లో ఆయనా ఒకరు. ముఖ్యంగా పేద ప్రజల్లో తనకంటూ చెరిగిపోని అభిమానం పొందుపరచుకునేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. నేడు ఆయన జయంతి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినా… సొంతంగా తానే ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు. కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలోని హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారనేది తెలిసిందే. సొంతంగా వ్యవహరించేంత స్వేచ్ఛ ఆ పార్టీలో ఉండదనీ అంటారు..! రాష్ట్రస్థాయిలో ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే కిందికి గుంజేద్దామని పన్నాగాలు పన్నేవారే ఎక్కువగా ఉంటారన్న కొన్ని విమర్శలున్న విలక్షణమైన పార్టీలో… తనకు తానుగా ఎదిగారు వైయస్సార్. తనపై పార్టీని ఆధాపడే స్థాయికి వచ్చారనడంలో సందేహం లేదు.
1978లో పులివెందుల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత 1983, 1985 ఎన్నికల్లోనూ వరుసగా గెలుపొందారు. ఆ తరువాత, 1989 ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తరువాత మరో మూడుసార్లు ఎంపీ అయ్యారు. అయితే, వరుసగా మూడు దశాబ్దాలపాటు ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎక్కడ పోటీ చేసినా ఓటమి అంటూ ఎరుగలేదు. కానీ, పార్టీలో ఆయనకి ఆశించిన స్థాయిలో అవకాశాలు తొందరగా రాలేదనే విమర్శ అప్పట్లో ఉండేది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే, ఇతర నేతలకంటే తక్కువ వయసులో ఉన్న వైయస్సార్ త్వరత్వరగా ఎదిగిపోతూ ఉంటే సహజంగానే దాన్ని అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నించేవారనీ అంటారు! తక్కువ వయసులోనే పీసీసీ పగ్గాలు వైయస్సార్ చేతిలో పడేసరికి కాంగ్రెస్ నేతల్లో సహజంగానే ఒకరకమైన ఈర్ష్యలాంటిది ఉండేదనేవారు. అవన్నీ తట్టుకుంటూ వచ్చారు.. కానీ, 2003 వేసవిలో ఆయన పాదయాత్ర ప్రారంభించిన తరువాత వైయస్సార్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కోటిగా మారుతూ వచ్చాయని చెప్పొచ్చు.
వైయస్ పాదయాత్ర ప్రారంభించేనాటికి ఆయన సీఎల్పీ లీడర్ మాత్రమే. పీసీసీ అధ్యక్షుడూ కాదు, సీడబ్ల్యూసీ మెంబరు కూడా కాదు. అప్పటికి కాంగ్రెస్ లో చాలామంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి. అలాంటి సమయంలో తన సొంత నిర్ణయంతో పాదయాత్రకు వెళ్లిపోయారు. దాన్ని చాలామంది వ్యతిరేకించారు కూడా! ఇక, ఆయన పాదయాత్ర ప్రారంభమైన తొలినాళ్లలో… వైయస్సార్ ఏ జిల్లాలో ప్రవేశిస్తే, ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు హాజరు కావడం మానేసి, ఆయన యాత్రను బహిష్కరించిన పరిస్థితీ ఉంది. అయితే, ఆయన యాత్ర చేసుకుంటూ వెళ్తూ పోతుంటే.. ప్రజల నుంచీ అనూహ్య స్పందన మొదలైంది. మండు వేసవిలో ఆయన నడుస్తూ, ఎక్కడా ఎలాంటి బ్రేకులూ తీసుకోవడం, సెలవుల పేరుతో యాత్రను తాత్కాలికంగా ఆపడం లాంటివి చెయ్యకుండా… పేదల్ని లక్ష్యంగా చేసుకుని యాత్ర సాగించారు. ఆ సంకల్పశుద్ధి ప్రజలను ఆకర్షించింది.
ఆ తరువాత, ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా 108 సేవలు, పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్… ఇలా పేదలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కొన్ని పథకాలను ప్రవేశపెట్టి, వాటిని సమర్థంగా అమలు చేయగలిగారు. ఆ పాదయాత్ర వైయస్ ను చాలా మార్చిందని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. నిజానికి ఓ సందర్భంలో ఆయనే స్వయంగా మాట్లాడుతూ.. పాదయాత్ర తరువాత తనలోని కోపం అనే నరాన్ని తెంచేసుకున్నానని అన్నారు. నాటి పాదయాత్రతో కాంగ్రెస్ లో అసమ్మతి నేతలంతా వైయస్ వెంట నడవాల్సి వచ్చింది. అదే ఊపు కొనసాగిస్తూ.. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు వైయస్సార్. ఏపీ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించగలిగారు.