దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారు. లోక్ సభతోపాటు, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతూనే ఉంది. పాలనా గడువు తీరని రాష్ట్రాలను కొన్నాళ్లు ముందుగా ఎన్నికల నిర్వహణకు సిద్దం చేయడం, గడువు పూర్తయిన రాష్ట్రాలను కొన్నాళ్లు వేచి ఉంచే ప్రయత్నం చేసేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, యాభైకి పైగా ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు లా కమిషన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్రస్తుతం లా కమిషన్ ఆయా పార్టీలతో చర్చలు జరుపుతోంది.
అయితే, జమిలి ఎన్నికల ప్రతిపాదనలకు ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నట్టు సమాచారం. తెలుగుదేశం, జేడీయు, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే.. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీల నుంచీ తిరస్కారమే ఎదురౌతోంది. ఇక, వామపక్షాల విషయానికొస్తే వారు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితే. జమిలికి వ్యతిరేకంగానే అత్యధిక పార్టీల అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీంతో మోడీ ఆశించినట్టుగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే అంశంగా కనిపించడం లేదు.
ఇంకోపక్క, భాజపా నేతల వైఖరి కూడా ఈ తరహా వ్యతిరేకత వ్యక్తం కావడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలకు దమ్ములేదు, భాజపాని ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టే జమిలికి భయపడుతున్నారు అంటూ రామ్ మాధవ్ లాంటివాళ్లు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంతేగానీ… రెండు ఎన్నికలూ ఒకేసారి నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పార్టీలకు వివరించి, సామరస్యపూర్వకంగా మద్దతు కూడగట్టే వైఖరి భాజపాలో కనిపించడం లేదు! ఇలాంటి సవాళ్ల వల్ల ప్రాంతీయ పార్టీలు మరింతగా బిగిసుకు కూర్చున్నాయి.
ఇక, ఏపీ విషయానికొస్తే… టీడీపీ ఈ ప్రతిపాదనను ముందే తిరస్కరించేసింది. ఏపీలో ఐదేళ్లపాటు టీడీపీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందనీ, ఆర్నెల్లు ముందు అధికారం కోల్పోవాల్సి వచ్చినా.. ఆ మేరకు రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడుతుందనీ, ఇప్పటికే కేంద్ర నిర్లక్ష్యానికి తీవ్రంగా గురౌతున్నామని టీడీపీ తేల్చి చెప్పేసింది. వైకాపా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించే పరిస్థితి కనిపిస్తోంది. లా కమిషన్ ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఓ ముగ్గురి సభ్యుల బృందం సిద్ధమైంది. భాజపా ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితిలో వైకాపా ఉందో లేదో తేలిపోతుంది..! విజయసాయి రెడ్డి చర్చలకు వెళ్తున్నారంటే… పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరమూ లేదు.