సాధారణంగా సాక్షిలో ప్రధాన వార్త, ఆంధ్రజ్యోతిలో ఎక్కడో మూలన ఉంటుంది. అలాగే ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త, సాక్షిలో కనిపించను కూడా కనిపించదు. జగన్ కేసుల పురోగతికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త అయితే సాక్షిలో అసలు అది వార్తే కాదు. అలాగే అధికార పార్టీ అవినీతికి సంబంధించిన వార్త సాక్షిలో బ్యానర్ కథనం అయితే ఆంధ్రజ్యోతిలో అది ఏ మూలనో, ఉంటుంది లేదంటే అదీ లేదు. కానీ, రేణు దేశాయ్ ని ఇటీవల సాక్షి యాంకర్ స్వప్న ఇంటర్వ్యూ చేస్తే అది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ కథనం అయింది.
“విడాకులు అడిగింది పవనే అని, బాధపడినా, విడాకులు ఇచ్చేశానని, తాను భరణం తీసుకోలేదని, పిల్లలకు హక్కుగా వచ్చేది మాత్రమే తీసుకున్నానని , పదకొండేళ్లుగా తనతో కాపురం చేస్తూ తనకు తెలియకుండా ఒక అమ్మాయి తో పవన్ కళ్యాణ్ బిడ్డను కన్నందుకే విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని” రేణు దేశాయ్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు సాక్షి టీవీ యాంకర్ స్వప్న కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ చెప్పింది. అయితే రేణుదేశాయ్ ఆంధ్రజ్యోతికి ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా “ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు” అంటూ రేణు దేశాయ్ వ్యాఖ్యలను తన బ్యానర్ కథనంలో ఫ్రంట్ పేజీలో ప్రచురించింది ఆంధ్రజ్యోతి.
మామూలు అయితే ఇందులో పెద్దగా పట్టించుకోవాల్సిందేమీ లేదు కానీ, ఆంధ్రజ్యోతి మీద వైయస్ జగన్ పార్టీ తరఫున కొన్ని కేసులు పెట్టి కోర్టు మెట్లెక్కడం వరకు జరిగింది. అలాగే సాక్షిని అందులో వచ్చే వార్తలను రాధాకృష్ణ గారు తన పత్రిక లో తన చానల్లో, సొంత వ్యాఖ్యానాలతో చీల్చి చెండాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యాఖ్యలను తమ దగ్గర ఫుటేజ్ లేకపోయినా కూడా ప్రముఖంగా, మొదటి పేజీలో ప్రచురించారు . పోనీ, ఇదేమైనా ప్రజా సమస్యలకు సంబంధించిన అంశమా అంటే అదీ కాదు, ఒక పార్టీ నాయకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం.
ఒక ప్రధాన పత్రిక అయి ఉండి, మిగతా వాళ్లకు జర్నలిజం సూక్తులు చెబుతూ, తమ వద్ద ఫుటేజ్ లేని అంశానికి సంబంధించిన వార్తను, తాము నిత్యం ఆడిపోసుకునే పత్రిక దగ్గర ఉన్న ఫుటేజ్ ని ఉటంకిస్తూ మొదటి పేజీలో బ్యానర్ కథనం ప్రచురించడం ఆంధ్రజ్యోతికి మాత్రమే సాధ్యమైన కొత్త జర్నలిజం ఒరవడి.