కేంద్రం పట్టుపట్టి మరీ ముందస్తు జమిలి ఎన్నికల దిశగా పావులు కదుపుతోంది. అవి సాధ్యం అవుతాయా? కావా? అన్నది పక్కన పెడితే, ఈ విషయమై తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏ మేరకు కరెక్ట్ అన్నది చూడాల్సి వుంది. ప్రజలు తమను అయిదేళ్లు పాలించమని అధికారం అందించారు, పాలిస్తాం అని అనడం వేరు. అలా కాకుండా రకరకాలుగా మాట్లాడడం వేరు. దీనివల్ల కనిపించని ఇబ్బందులు వున్నాయి. అదే సమయంలో జమిలి ఎన్నికల మీద తృణమూల్ కావచ్చు, తేదేపా కావచ్చు చెబుతున్న కారణాల్లో ఒకటి అయిన స్థానిక సమస్యలు అన్న వ్యవహారం కూడా కరెక్ట్ కాదేమో అనుకోవాలి.
ఎందుకంటే, 2014లో కావచ్చు, అంతకు ముందు కావచ్చు చాలా రాష్ట్రాలకు జమిలి ఎన్నికలే జరిగాయి. అంత మాత్రం చేత ప్రజలు విజ్ఞతతో కాకుండా, ఏకపక్షంగా ఓటు వేసారని అనలేం. మొన్న ఎన్నికలు అంటే కేంద్రంలో అధికారం కోసం పోటీ పడిన పార్టీ, రాష్ట్రంలో అధికారం కోసం పోటీపడిన పార్టీ కలిసి ఎన్నికల బరిలోకి దిగి వుండొచ్చు. కానీ చరిత్రలో అనేకసార్లు జమిలి ఎన్నికలు జరగడం, ప్రజలు ఎంపీకి ఓ పార్టీకి, ఎమ్మెల్యేకు మరో పార్టీకి వేసిన వైనాలు వున్నాయి. అంటే ప్రజలకు ఆ మాత్రం విచక్షణ ఎప్పడూ వుంది.
ఇక ఇంకో చిత్రం కూడా వుంది. ఎన్నికల టైమ్ లో మన ఎంపీ అభ్యర్థులు ఒక్కోసారి ఎమ్మెల్యేకు మీ ఇష్టం ఎంపీకి మాత్రం మన పార్టీకి వేయండి అనడం కద్దు. అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా. అంటే జమిలి ఎన్నికలు జరిగినా ఎవరి వ్యవహారం వారిదే, ప్రజలు కూడా ఆ మాత్రం వ్యవహార జ్ఞానం కలిగే వున్నార అన్నది క్లియర్.
ఇక వర్తమానానికి వస్తే, తెలుగుదేశం పార్టీ జమిలి ఎన్నికల విషయంలో చేస్తున్న వాదన ఆ పార్టీనే ఆత్మరక్షణలో పడేసే విధంగా వుంది. తెలుగుదేశం పార్టీ రకరకాలుగా చెబుతూ వస్తోంది. ఒకటి పూర్తి కాలం పాలించే, ఎన్నికలకు వెళతామని. అది ఓకె. అలా చెప్పడం వేరు, ముందస్తుకు మేం వ్యతిరేకం అని చెప్పడం వేరు. ఈ రెండింటికి సున్నితమైన తేడా వుంది. ఆ తేడా కారణంగా ప్రజల్లొకి అనుకోని సంకేతాలు వెళ్లే ప్రమాదం వుంది.
ఇదిలా వుంటే, లోక్ సభకు కావాలంటే ముందస్తు చేసుకోండి, అసెంబ్లీకి వద్దు అని చెప్పడం ముమ్మాటికీ సరైన వ్యూహం కాదు. ఎందుకని? సరే, మోడీ ప్రభుత్వం పంతానికి పోయి ముందస్తుకు వచ్చింది అనుకుందాం. అసెంబ్లీకి వదిలేసి, లోక్ సభకు ఎన్నికలు జరిగాయి అనుకుందాం. అప్పుడు ప్రజలు విచక్షణతో కేంద్రంలో కాంగ్రెస్ ను ఇంకా కనికరించకుండా, మళ్లీ భాజపాకే పట్టం కడితే, తేదాపా సీట్లు ఇచ్చినా కేంద్రంలో అధికారం చెలాయించలేదేమో? అన్న అనుమానంతో ఇలా చేస్తే? అప్పుడేమవువుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీద ఇది భయంకరమైన ప్రభావం చూపిస్తుంది.
సరే, భాజపాకు రాష్ట్రంలో అంత సీన్ లేదు, తేదేపా, వైకాపానే పోటీ పడతాయి అనుకుందాం. అప్పుడయినా ఫలితం సరిగ్గా వస్తే ఓకె. తేడా వస్తే, అసెంబ్లీ ఎన్నికల మీద అప్పుడు కూడా మరింత ప్రభావం పడుతుంది. అలాంటపుడు జమిలి ఎన్నికలే బెటర్. ఎందుకంటే, రాష్ట్రంలో తేదేపా అయిదేళ్లు ఎలా పాలించింది, మరోసారి అవకాశం ఇస్తే ఎలా పాలిస్తుంది అన్నది చెప్పుకోవడానికి అవుతుంది. మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలవుతుంది.
తేదేపా ముందు రెండు వాదనలే సరైనవి. ఒకటి అఫెన్స్ లోకి వెళ్లి, బస్తీమే సవాల్, మేం రెడీ అని జమిలి బరిలోకి దూకడం. లేదూ, అసలు టోటల్ గా ముందస్తును వ్యతిరేకించడం. అంతే కానీ, ఒకదానికి అలా, మరోదానికి ఇలా అని అనడం సరికాదు.
పైగా వైకాపా ఎంపీలు రాజీనామా టైమ్ లో తేదేపా వాదన ఏవిధంగా వుంది. ఉపఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్నికలకు భయపడ్డారు అని కదా? మరి ఇప్పుడు సీన్ ఏ విధంగా వుంది? ఎవరు భయపడుతున్నట్లు కనిపిస్తోంది?
ఇవన్నీ ఆలోచిస్తే, తేదేపా ఈ రోజు చేసిన ప్రకటనల సంగతి అలా వుంచి, రేపయినా సరైన స్టాండ్ తో, సరైన ప్రకటనలతో ముందుకు వెళ్లాలి. లేదంటే, ప్రజల్లోకి రాంగ్ సంకేతాలు వెళ్తాయి. వాస్తవానికి మీడియా తేదాపా పట్ల కాస్త అనుకూల ధోరణితో వుంది కాబట్టి, సరిపోయింది. లేదూ అంటే ఈ వ్యవహారాన్ని కాస్త రచ్చ చేసి వుండేవి. అందువల్ల ఏ డ్యామేజ్ జరగని నేపథ్యంలో తేదేపా జమిలి, ముందస్తు ఎన్నికలపై సరైన వ్యూహం, సరైన ప్రకటన చేయడం అవసరం.
వాస్తవానికి ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. ఇలా తప్ప మరోలా మాట్లాడే అవకాశం కూడా తెదేపా లేదు. ఎందుకంటే పార్లమెంట్ కు ముందస్తు అన్నది తేదేపా వద్దని అనలేదు. అలా అని చెప్పి అసెంబ్లీకి ముందస్తుకు వెళ్లే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో అంతలాలేదు. ఎందుకంటే,జగన్ పాదయాత్ర వేడి, పవన్ వేడి చల్లారాల్సి వుందిఅందువల్ల ఇలా తప్ప మరోలా మాట్లాడడానికి లేదు. మాట్లాడకుండా వుండడానికి లేదు ఎందుకంటే లా కమిషన్ ముందు ఏదో ఓ వాదన ఇవ్వాల్సి వుంది. అందుకే ఇలా ఇచ్చినట్లు అనుకోవాలి.
ఏమైనా విభజన సమయంలో కావచ్చు, హోదా సమయంలో, ప్యాకేజీ సమయంలో, మళ్లీ ఇప్పుడు హోదా పోరు మీద, చాలా బ్యాలెన్స్ డ్ గా, దొరకకుండా మాట్లాడగలిగిన నేర్పు చూపిన చంద్రబాబు, ఇప్పుడు ఈ సిట్యువేషన్ లో కూడా ఆ నేర్పు చూపించడం అవసరం.
ఆర్ మార్తండ శర్మ