కనీసం ఆ పోస్టర్ వేసుకోవడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి. అలాంటిది `రంగస్థలం 100` రోజుల పోస్టర్ కొండంత ఉత్సాహాన్ని, ప్రేరణనీ తీసుకొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. `బాహుబలి` వంద రోజుల పోస్టర్ చూశాక.. అలాంటి సందర్భం రావడం ఇదే తొలిసారి. నిజానికి ఏ అభిమానీ తన హీరో సినిమా వంద ఆడాలని ఈరోజుల్లో కోరుకోవడం లేదు. ఎందుకంటే సరిస్థితులు అలా మారిపోయాయి. తొలి మూడు రోజుల్లో నే సినిమా భవిష్యత్తు అంతా పరిభ్రమిస్తోంది. రెండు వారాలు సినిమా నిలబడిందంటే అది హిట్టు కిందే లెక్క. నిజంగా ఓసినిమా 50 రోజుల పాటు థియేటర్లో ఉందంటే అది గ్రేటాతి గ్రేటు. అందుకే శతదినోత్సవాల్ని జనం మర్చిపోయారు.
ఇది వరకు నిజంగానే ఓ సినిమాకి వంద ఆడే స్టామినా ఉండేది. సినిమా తప్ప మరో వ్యాపకం లేని రోజుల్లో, చూసిన సినిమానే మళ్లీ చూసే అభిమానులు ఉండే కాలంలో, తక్కువ థియేటర్లలో సినిమాని విడుదల చేద్దామనే పద్ధతి ఉన్నప్పుడు ఈ ఫీట్ చూడగలిగేవారు. కొంతమంది వీరాభిమానులు 50 రోజుల సినిమాని కూడా వందకు నడిపించేవారు. తమ సొంత డబ్బులతో తన అభిమాన హీరో సినిమాని హిట్ చేసేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. అభిమానుల అండదండలు కేవలం నామ మాత్రంగానే మిగిపోయాయి. హీరోలు కూడా వంద రోజుల గురించి పట్టించుకోవడం లేదు. ఈమధ్య సూపర్ డూపర్ హిట్ సినిమాలెన్ని వచ్చినా వంద పోస్టర్ వేసుకునే దమ్ము చాలలేదు. కానీ రంగస్థలం ఆ ధైర్యం చేసింది. ఈ సినిమా వంద రోజులు ఎక్కడ ఆడింది? ఎన్ని సెంటర్లలో ఆడింది? డైరెక్ట్ సెంటర్లు ఎన్ని? షిఫ్టింగులు ఎన్ని? అని ఎవరూ పట్టించుకోవడం లేదు. వంద ఆడింది… అదే గ్రేట్ అనుకుంటున్నారు. నిజానికి ఈ పోస్టర్ వేసుకునే హక్కు ఈ సినిమాకి ఉంది. నాన్ బాహుబలి రికార్డులన్నీ ఎగరేసుకుపోయిన సినిమా ఇది. మనదైన పల్లెవాతావరణం, అక్కడి రాజకీయాల్ని తెరపై ప్రభావవంతంగా చూపించిన సినిమా ఇది. నటీనటులు, సాంకేతిక నిపుణులు కలసి కట్టుగా ప్రాణం పోసిన సినిమా ఇది. అందుకే రంగస్థలంకి ఆ హక్కు ఉంది.