‘రాజకీయాల్లోకి కొత్తరక్తం రావాలి. కొత్తవాళ్లు రావాలి. గెలుపు అనేది పోరాటంలో ఒక భాగమే. సమాజంలో మార్పు అంతిమ లక్ష్యం కావాలి’… జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలివి. కొత్త రక్తం అంటున్నారుగానీ.. ఇంతవరకూ జనసేనలోకి వచ్చి చేరిన వారు కొద్దిమందే ఉన్నారు. ప్రముఖ హడావుడి జనసేనలో కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్నిస్థానాలూ పోటీ చేసేందుకు సిద్ధమౌతున్న పవన్ కల్యాణ్.. కనీసం కొన్ని స్థానాల్లోనైనా ప్రముఖులను నిలబెట్టాల్సి ఉంటుంది! అయితే, అలా ప్రముఖులు అని చెప్పుకోదగ్గ నేతల సందడి ప్రస్తుతానికి జనసేనలో కనిపించడం లేదు. జనసేనవైపు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న సీనియర్లు కూడా కనిపించడం లేదు.
నిజానికి, ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించిన కొత్తలో ప్రముఖ నేతలు క్యూ కట్టారు. కోటగిరి విద్యాధరరావు, దేవెంద్ర గౌడ్, భూమా నాగిరెడ్డి వంటి కీలక నేతలు వారే స్వచ్ఛందంగా వచ్చి చిరంజీవికి అండగా నిలబడ్డారు. ఇతర రంగాల నుంచి కూడా చాలామంది ప్రజారాజ్యంలోకి వచ్చి చేరారు. కానీ, జనసేన విషయానికి వచ్చేసరికి ఆ తరహా ఊపు కనిపించడం లేదనే చెప్పాలి. పవన్ కల్యాణ్ ఏదైనా సమావేశం, లేదా చర్చా కార్యక్రమాలు పెడితే ప్రముఖులు తరలి వస్తారు. కానీ, పార్టీలో చేరేందుకు పవన్ ఆహ్వానిస్తున్నవారి నుంచి ఆశించిన స్పందన ఉండటం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా, సీనియర్ నేత దాడి వీరభద్రరావును పార్టీలోకి పవన్ ఆహ్వానించారు. కానీ, ఆ తరువాత పరిస్థితి ఏంటనేది ఇంకా తేల్లేదు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కూడా ఈ మధ్య పవన్ ను కలిశారు. చాలాసేపు చర్చించారు. కానీ, ఆ చర్చలు ఆయన పార్టీలో చేరేందుకు జరిగాయా, లేదా ఇతర అంశాల నేపథ్యంలో జరిగాయనేది స్పష్టత లేదు.
ఇక, పవన్ కు ఈ మధ్య అంత్యంత సన్నిహితమైన వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. జె.ఎఫ్.సి.లో ఆయనే కీలక పాత్ర పోషించారు. పార్టీలో చేరిక విషయమై ఈ మధ్య పవన్ తో చర్చకు వచ్చిందనీ వార్తలొచ్చాయి. కానీ, ఆ చర్చల సారాంశమేంటో బయటకి రాలేదు. ఇక, టీడీపీ నుంచి చాలామంది జనసేనలోకి వస్తారంటూ ఆ మధ్య పవన్ ఒక ప్రకటన చేశారు. అదీ కేవలం గాలి ప్రకటనగానే మిగిలినట్టు కనిపిస్తోంది. సో.. కొద్దిమంది మాజీ ప్రజారాజ్యం నేతలు మినహా… పేరున్నవారెవ్వరూ ప్రస్తుతానికి జనసేనవైపు వస్తున్న వాతావరణం కనిపించడం లేదు. అన్ని సీట్లలో పోటీకి సిద్ధమౌతున్న తరుణంలో… కనీసం కొన్ని స్థానాల్లోనైనా ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకుల అవసరం జనసేనకు ఉంది. మరి, పవన్ చర్చలు విఫలమౌతున్నాయా, లేదా చివరి నిమిషంలో ఆలోచిద్దాం అనే నాన్చుడు ధోరణిలో పవన్ కలుస్తున్న నేతలున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా, చేరికల విషయంలో నాటి ప్రజారాజ్యంలో కనిపించిన ఊపు, నేటి జనసేనలో ప్రస్తుతానికి కనిపించడం లేదన్నది వాస్తవం.