సమంత సినిమాల నుంచి నిష్క్రమిస్తుందని, ఇక ఇంటికే పరిమితం అవుతుందని ఇటీవల వార్తలొచ్చాయి. ‘రంగస్థలం’ తరవాత సమంత కొత్త సినిమాలపై సంతకాలు చేయడానికి అంతగా ఇష్టపడడం లేదు. అందుకే ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే వీటిపై నాగచైతన్య స్పందించాడు. సమంత సినిమాలకు దూరం అవ్వడం లేదని, కాకపోతే.. అప్పుడప్పుడూ కాస్త గ్యాప్ తీసుకోవచ్చని చెప్పాడు చైతూ. ”ఈమధ్య వచ్చిన వార్తల్లో నిజం లేదు. తను సినిమాల్లో నటిస్తుంది. కాకపోతే… అప్పుడప్పుడూ చిన్న పాటి బ్రేక్ తీసుకుంటుందేమో. అంతకు మించి ఏం ఉండదు. తనకు సినిమాలంటే ప్యాషన్. ఈ రంగానికి దూరం కాదు” అని చెప్పేశాడు. సో.. సమంత సినిమాలకు దూరం అవుతోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే… ఇప్పుడు సమంత చైతూ సినిమాలపైనా దృష్టి పెడుతోంది. చైతూ ఎంచుకునే కథల విషయంలో సమంత పాత్ర ఎక్కువవుతోంది కూడా. ఈ విషయాన్ని చైతూ కూడా ఒప్పుకున్నాడు. ”మా మధ్య కథల గురించి డిస్కర్షన్స్ బాగానే జరుగుతాయి. తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఈ పోస్టర్నచ్చలేదు, ఈ కథ నచ్చలేదు అని మొహం మీదే చెప్పేస్తోంది. నాన్నలానే..” అంటున్నాడు చైతూ.