“కొరియర్ ” అంటూ కొరియర్ బాయ్ అరచిన అరుపు… ఓ పెళ్లిని ఆపేసింది. అరుపు వల్ల పెళ్లి ఆగిపోలేదు.. ఆ బాయ్ తెచ్చిన కొరియర్ వల్ల ఆగిపోయింది. ఆ కొరియర్లో ఉన్న మ్యాటర్ వల్ల ఆగిపోయింది. కొరియన్ వచ్చిన తర్వాత కాసేపట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా… గంభీరమైన వాతావరణం నెలకొంది. తనకు పెళ్లి వద్దని పెళ్లి కుమారుడు తెగేసి చెప్పాడు. పిల్ల తల్లిదండ్రులు… బతిమాలుకుంటే..అసలు కారణం చెప్పారు. కొరియర్లో పెళ్లి కూతురు నగ్నదృశ్యాలు ఉన్న వీడియోలు వచ్చాయని .. తాను పెళ్లి చేసుకునేది లేదని చెప్పడంతో వధువు తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని ఈదరవల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే కొరియర్లో వీడియోలు రావడం.. పెళ్లి ఆగిపోవడంతోనే.. ఈ క్రైమ్ కథ అయిపోలేదు. అసలు వీడియోలు ఎవరు పంపించారన్న విషయాన్ని పోలీసులు చాలా వేగంగా బయటకు తీశారు. ఎవరో కాదు.. పెళ్లి పనుల్లో బిజీగా ఉండి.. హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్న… సమీప బంధువే. పెళ్లి కూతురుకు వరుసకు బావ అవుతాడు. ఆయన భార్య ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. దాంతో ఫోటోగ్రాఫర్‌గా గ్రామంలోనే ఉంటూ… మరదలు వరుసయ్యే పెళ్లి కూతురుపై కన్నేశాడు. పెళ్లి ఆపేస్తే.. ఇక ఎవరూ పెళ్లి చేసుకోవడానికి రారని.. భావించి.. దారుణానికి ఒడిగట్టాడు. తను ఫోటోగ్రాఫర్ కావడంతో.. మార్ఫింగ్ చేసిన వీడియోలను.. పెళ్లికొడుకుకు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారం తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇలా పెళ్లిళ్లు ఆపడానికి.. వధువు పేరుతో ఆశ్లీల దృశ్యాలు పంపుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయి. కొన్ని ఘటనల్లో పెళ్లి తప్పించుకోవడానికి వెరైటీగా..అమ్మాయిలే ఇలాంటి ఆలోచనలు ..తమ బాయ్‌ఫ్రెండ్స్‌కి ఇస్తున్న ఘటనలు.. హైదరాబాద్‌లో వెలుగు చూశాయి. టెక్నాలజీ రాకతో.. నేరాల రూపం కూడా మారుతోంది.