ప్రకాశం జిల్లా ఒంగోలులో… ప్రత్యేకహోదా ప్లకార్డు పట్టుకున్న వ్యక్తిపై బీజేపీ నేతలు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మినారాయణ..కొద్ది రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆ పర్యటనల్లో అక్కడక్కడా నిరసన సెగ తగులుతోంది. ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో.. కన్నా లక్ష్మినారాయణ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్.. ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్‌ను బీజేపీ నేతలు తరిమి తరిమికొట్టారు. కింద పడేసి కాళ్లతో తొక్కారు. పోలీసులు అడ్డుకుంటున్నా… బీజేపీ నేతలు వెనక్కి తగ్గలేదు. అతి కష్టం మీద పోలీసులు శ్రీనివాస్ ను పోలీసులు తప్పించగలిగారు.
ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాసులు కొద్ది రోజులుగా ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ వస్తున్నారని తెలిసి.. ఆయన పర్యటన జరిగే మార్గంలో నిరసన తెలిపేందుకు ఉదయం నుంచి.. నల్ల దుస్తులు, ప్లకార్డుతో అదే దారిలో నిలబడ్డారు. కానీ ఎవరూ అడ్డు చెప్పలేదు. కానీ కన్నా… ర్యాలీ అక్కడికి వచ్చే సరికి.. బీజేపీ నేతలు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. శ్రీనివాస్‌పై దాడి చేశారు. ఎవరెన్ని దాడులు చేసినా ప్రత్యేకహోదా నినాదం వినిపిస్తూనే ఉంటానని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.
కన్నా లక్ష్మినారాయణ పర్యటనల్లో అనేక చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిరసనలపై బీజేపీ నేతలు దాడులకు తెగబడుతూండటంతో ఉద్రిక్తంగా మారుతున్నాయి. అనంతపురంలో విభజన హామీల విషయంలో నిరసన తెలుపుతున్న ఇతర పార్టీల నేతలపై… బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో పెద్ద ఇష్యూ అయిపోయింది. తర్వాత నెల్లూరు జిల్లా కావలిలో ఓ లారీ డ్రైవర్… కన్నాపై చెప్పు విసిరాడు. అప్పుడు కూడా బీజేపీ నేతలు ఆ వ్యక్తిని తమ చెప్పులు తీసి మరీ కొట్టారు. ఇప్పుడు ఒంగోలులోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై దాడులకు చేస్తూ.. బీజేపీ నేతలు మళ్లీ… ఏపీలో శాంతిభద్రతలు లేవని…ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒంగోలులో ప్రత్యేకహోదా ఉద్యమకారుడిపై బీజేపీ నేతల దాడి మత్రం సామాన్యుల్లో కూడా చర్చనీయాంశమవుతోంది.