కర్నూలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని.. వారిని అఖండ మెజార్టీతో గెలిపిచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలులో అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన లోకేష్… అనూహ్యంగా అభ్యర్థుల ప్రకటన చేయడం..టీడీపీ నేతలనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. టిక్కెట్లు ఖరారు చేసిన ఇద్దరూ.. వైసీపీ నుంచి టీడీపీ చేరిన వారే. పైగా.. రెండు సీట్లపైనా ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు కొందరు ఉన్నారు.
కర్నూలు అసెంబ్లీ స్థానంలో తాను పోటీ చేస్తానని.. కొద్ది రోజులుగా… రాజ్యసభ సభ్యుడు.. టీజీ వెంకటేష్ తనయుడు భరత్ కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా ఉంది. ఇలాంటి సమయంలో లోకేష్ ఎస్వీ మోహన్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేస్తూ ప్రకటన చేయడం కర్నూలు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీకి పలువురు టీడీపీ సీనియర్లు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా… డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరులు.. ఈ సీటు కోసం ప్రతీ సారి పోటీ పడుతూంటారు. చంద్రబాబు ఏదో ఒకటి చెప్పి బుజ్జగిస్తూంటారు. ఇప్పుడీ సీటును బుట్టా రేణుకకు ఖరారు చేయడం.. కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్న వాదన తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది.
అయితే లోకేష్ టిక్కెట్లను ఖరారు చేస్తూ చేసిన ప్రకటనను.. టీడీపీ వర్గాలు సీరియస్ గా తీసుకుంటాయో లేదోనన్న సందేహం కూడా ఉంది. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు.. టిక్కెట్ల ఖరారు చేసే ప్రక్రియ ఎలా ఉంటుందో… టీడీపీ నేతలకు బాగా తెలుసు. సర్వేల మీద సర్వేలు చేయించుకుని… ప్లస్సులు…మైనస్సులు బేరీజు వేసుకుని… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎవరికైనా టిక్కెట్లపై క్లారిటీ ఇస్తారు. ముఖ్యంగా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ నాన్చుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే లోకేష్ అభ్యర్థుల ప్రకటనకు..చంద్రబాబు ఆమోదం ఉందా లేదా అన్నదానిపైనే…టీడీపీ నేతలు ఎక్కువగా చర్చలు సాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో.. పార్టీపై నారా లోకేష్ పట్టు బిగిస్తున్నారు. ఈ కోణంలో… కొన్ని నియోజకవర్గాల్లో వర్గ పోరును దూరం చేయడానికి.. ఇతరులు ఆశలు పెట్టుకోకుండా ఉండటానికి ఇలా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించే వ్యూహం అమలు చేస్తున్నారేమోన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి కర్నూలులో రెండు సీట్లకు టీడీపీ అభ్యర్థులు ఖరారైనట్లే.ఇక లోకేష్ ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ఎవరైనా అభ్యర్థుల్ని ప్రకటిస్తారన్న ఉత్కంఠ సహజంగానే ఏర్పడుంది.