శ్రీరాముడిపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ యాత్ర మొదలు కాకముందే ఆయన్ని హైదరాబాద్ లోని స్వగృహంలో పోలీసులు నిర్బంధించారు. దీంతో జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. హిందుత్వ వాదులు తరలి వచ్చారు. ఒక అభిమాని అయితే పెట్రోల్ పోసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా అంటూ కాసేపు హడలెత్తించాడు. పరిపూర్ణానంద గృహనిర్బంధంపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయడం సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. దాన్ని కేసీఆర్ కాలరాస్తున్నారన్నారు.
ఇక, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా హైదరాబాద్ లో అలజడికి కారణం అవుతున్న కత్తి మహేష్ ను నగరం నుంచి బహిష్కరించామని పోలీసులు ప్రకటించారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ భాజపా ఏదో ఒక ప్రయత్నం చేస్తుందన్న అనుమానాలు రేకెత్తాయి. ఆమేరకు భాజపా నేతలు కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించి, కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేసేందుకు సిద్ధపడుతున్న తరుణంలో… వారి ఆలోచల్ని వ్యూహాత్మకంగా మొగ్గలోనే కేసీఆర్ తుంచేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఓపక్క కత్తి మహేష్ ను నగర బహిష్కణ చేయించి, మరోపక్క స్వామీజీని గృహనిర్బంధంలో ఉంచడం ద్వారా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టి, భాజపాకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేశారనే అభిప్రాయమూ కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండింటినీ ఒకేసారి చేయడం ద్వారా ప్రభుత్వంపై ఎవ్వరూ ఎలాంటి విమర్శలు చేసే ఆస్కారం ఇవ్వకపోవడంతోపాటు, సామాజికంగా ఎలాంటి అనూహ్య పరిణామాలకూ అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనీ చెప్పొచ్చు. రాజకీయంగా చూసుకుంటే… ఈ అంశంపై పొలిటికల్ మైలేజ్ తీసుకునేందుకు భాజపాకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదనే చెప్పాలి.