వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా ముందుకు ఏ సందర్భంలో వచ్చినా… దాన్లో భాగంగా ఒక్కసారైనా సీఎం మీద ఆరోపణలు చేయాలన్న రూల్ ఏదో పెట్టుకున్నట్టున్నారు! జమిలి ఎన్నికలపై లా కమీషన్ ముందు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఢిల్లీ వెళ్లిన విజయసాయి, అక్కడ కూడా మరోసారి టీడీపీ సర్కారుపై ఆరోపణలు చేశారు. ఆంధ్రాలో అత్యంత అవినీతిపరుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు.
నైతిక విలువల్ని వదిలేసి, సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా చంద్రబాబు తయారయ్యారన్నారు. ఆంధ్రాలో జరిగిన అన్ని రకాల అవినీతిపైనా తమ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ ఉంటుందన్నారు. తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తప్పకుండా విచారణ చేయిస్తామనీ, దోషుల్ని శిక్షిస్తామనీ, చంద్రబాబు దుర్మార్గుడూ అవినీతిపరుడూ రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి అంటూ విమర్శించారు. ఆయన జైలుకు పోతాడనే విషయంలో ఏమాత్రం సందేహం లేదని విజయసాయి అన్నారు.
ఎంపీ విజయసాయి ఇదే మాటల్ని గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నారు! ఏపీ సీఎం తీవ్ర అవినీతి చేశారనీ, దానిపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయడం కోసమే పీఎంవో చుట్టూ తిరుగుతున్నానని ఆమధ్య చెప్పారు. కేంద్రం రంగంలోకి దిగుతుందనీ, అవినీతిపై విచారణ తప్పదనీ, చంద్రబాబు మెడకు కేసులు చుట్టుకోవడం ఖాయమని చాలాసార్లు అన్నారు! కానీ, ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చి, జగన్ ముఖ్యమంత్రి అయ్యాకనే విచారణ అంటున్నారు..!
ఏపీలో అవినీతి జరిగిందన్న ఆధారాలు ఆయన దగ్గరున్నప్పుడు ఆ విచారణ ఏదో ఇప్పుడే జరిగేలా ఆదేశించమని కేంద్రాన్ని కోరొచ్చు కదా! పోనీ, చంద్రబాబుపై కేసులు పెడితే కాపాడేందుకు కేంద్రం కూడా ఆయనకి మద్దతుగా లేదు కదా. ఎలాగూ భాజపా నేతలు కూడా టీడీపీపై రాజకీయ కక్షసాధింపు ధోరణిలోనే ఉన్నారు. అలాంటప్పుడు, ఇంకా విజయసాయి రెడ్డి ఇంకా ఎందుకు వెయిట్ చెయ్యాలి..? ఆ అవినీతి ఆధారాలేవో… ఏపీ నుంచి దోచుకెళ్లిన సొమ్మును సింగపూర్ లో ఎక్కడ దాచారో ఇప్పుడే విజయసాయి బయటపెడితే… వైకాపా అధికారంలోకి రావడం మరింత సులువు అవుతుంది! ఏపీ ప్రభుత్వంపై ఇంతవరకూ వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నాయి. చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు జతచేసి ప్రజల ముందు ఉంచితే బాగుంటుంది కదా! అది మానేసి ఎందుకీ కంఠశోష..?