ఎన్నికలు దగ్గరకి వస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల్లో నాయకుల మార్పులూ చేర్పులూ ఉండటం అనేది సహజం. జిల్లాలవారీగా ప్రభావవంతమైన నాయకులు ఎవరున్నారు, ఎవర్ని చేర్చుకోవాలి అనే వ్యూహలతో ప్రధాన పార్టీలు ఉంటాయి. కానీ, ఈ విషయంలో తెలుగుదేశం ఈ మధ్య కాస్త కినుకు వహిస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లోనే చర్చనీయం అవుతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్న నేతల విషయంలోనూ, పార్టీలో అసంతృప్తిగా ఉంటున్నవారిని వెంటనే బుజ్జగించడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ విషయంలో వైకాపా కాస్త చురుగ్గానే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. నిజానికి, ఒక దశలో వైకాపా నుంచి ఇబ్బడిముబ్బడిగా ఎమ్మెల్యేలను టీడీపీ ఆకర్షించి, చేర్చుకుంది. కానీ, నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశం కనిపించకపోవడంతో చేరికలకు చంద్రబాబు బ్రేక్ వేశారు. అయితే, అదే కారణంతో కొంతమంది కీలక నేతల్ని దూరం చేసుకోవడం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం భాజపా అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ మధ్య టీడీపీలో చేరేందుకే బాగా మొగ్గుచూపారట! ఆ సమయంలో టీడీపీ మరింత చురుగ్గా వ్యవహరించి ఉంటే ఆయన ఇటే వచ్చేవారని అధికార పార్టీకి చెందిన వర్గాలే ఇప్పుడు అంటున్నాయి! అలాగే, విశాఖకు చెందిన ఓ సీనియర్ నాయకుడు కూడా టీడీపీవైపే కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నా… ఎటూ తేల్చకపోవడంతో ఇప్పుడు ఆయన వేరే పార్టీవైపు మొగ్గుతున్నారని సమాచారం.
ఆనం రామనారాయణ రెడ్డి విషయంలోనూ టీడీపీ కాస్త ముందుగా స్పందించి ఉంటే ఆయన ఆ పార్టీలోనే ఉండేవారనీ, ఆయన అసంతృప్తిని మొదట్లో సీరియస్ గా తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డి టీడీపీలో చేరికపై చాలాకాలం కిందటే కథనాలు వచ్చాయి. ఆయన కూడా సిద్ధంగా ఉన్నా.. టీడీపీ అధినాయకత్వం నుంచి సరైన సమాచారం ఆయనకి లేదట! మధ్యలో వైకాపా కూడా ఆయన్ని ఆహ్వానించినా… చేరేందుకు ఇష్టపడక మౌనంగా ఉండిపోయారట. ఇలాంటి ప్రముఖ నేతలు కొన్ని జిల్లాల్లో ఉన్నారనీ, వారికి సంబంధించిన సమాచారం అధినాయకత్వానికి సరిగా వెళ్తోందా లేదా అనే చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతున్నట్టు సమాచారం. ఏడాదిలో ఎన్నికలు వస్తున్న ప్రస్తుత సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై దృష్టి సారించాలనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా ఆలస్యం చేసుకుంటూ పోతే.. ఈ అవకాశాలను వైకాపా అందింపుచ్చుకుంటుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి..