జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర యాత్ర పూర్తయిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం, కళింగ ఉద్యమం, పరిశ్రమలు ఇలా చాలా అంశాలపై పవన్ మాట్లాడేసి వెళ్లిపోయారు. అయితే, కొన్ని కీలక అంశాలపై మాత్రం ఆయన ఎందుకు స్పందించడం లేదంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పవన్ ను ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నవి ఆయన సొంత మాటలా, జగన్ ఆలోచనలా, భాజపా స్క్రిప్టా అంటూ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పవన్ కళ్లుండీ చూడలేకపోతున్నారు అన్నారు. రాష్ట్రం తీవ్రమైన సమస్యల్లో ఉన్నప్పుడు కూడా రాజకీయాలు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ మండిపడ్డారు.
జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ. 70 వేల కోట్లకుపైగా ఉన్నాయంటూ నివేదిక పవన్ తయారు చేశారన్నారు. కానీ, దాంతో కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ఎందుకు లేకపోయిందని ప్రశ్నించారు. ఏపీకి చెయ్యాల్సినవన్నీ చేశామంటూ సుప్రీం కోర్టులో కేంద్రం తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తే… దానిపై పవన్ ఎందుకు స్పందించలేదన్నారు? కేంద్రంపై అవిశ్వాసం పెడితే, దేశమంతా పర్యటించి మద్దతు కూడగడతానన్న పవన్, గత పార్లమెంటు సమావేశాల సమయంలో ఎందుకు మౌనంగా ఉండిపోయారన్నారు? కాపులకు రిజర్వేషన్లు కల్పిచేందుకు టీడీపీ కట్టుబడి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందనీ, దానిపై కేంద్రం స్పందించకపోతే ఒత్తిడి తెచ్చేలా పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు..?
ఉత్తరాంధ్ర వెనకబాటుతనంపై ఉద్యమిస్తాననే పవన్ కల్యాణ్, విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడరని గంటా ప్రశ్నించారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ. 350 కోట్లు నిధులు వెనక్కి తీసుకుందనీ, విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు తుది అనుమతు ఇవ్వలేదనీ… జగన్ అవినీతి కేసుల్లో ఏడాదిలోగా తీర్పు వెలువడాల్సి ఉన్నా ఎందుకు తుది తీర్పు రావడం లేదని పవన్ కల్యాణ్ నిలదీయడం లేదంటూ గంటా ప్రశ్నించారు.
మంత్రి గంటా ప్రశ్నలు లాజికల్ గా ఉన్నాయి. పవన్ నుంచి ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుందో లేదో చూడాలి. కానీ, పవన్ పోరాటం అంటూ బాగానే మాట్లాడతారుగానీ… వాటిలో అంశాల మీద కాకుండా సిద్ధాంతాల చర్చే ఎక్కువగా ఉంటోంది. దేశం, వెనకబాటుతనం, యువత, సమైక్యత.. ఇలా స్థూలంగా మాట్లాడతారే తప్ప, ఆ కలలు వాస్తవరూపం దాల్చాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలనేది పవన్ విస్మరిస్తున్న అంశం. ఏమైనా అంటే… ముఖ్యమంత్రి రాజీనామా చేసి రావాలి, నారా లోకేష్ నాతో రావాలి, కలిసి పోరాడదాం అంటారు!