కన్నా లక్ష్మినారాయణ అంటే.. మొదట గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి… మంత్రి వరకూ.. దశాబ్దాల పాటు ఒకే పార్టీలో ఉన్నారు. వరుసగా గెలుస్తూ.. పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి మంత్రి పదవులు పొందుతూ వచ్చారు. కానీ 2014 ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ కోసం ఆయన పార్టీ మారక తప్పలేదు. తాను జాతీయ పార్టీలో పని చేశాను కాబట్టి.. తనకు జాతీయ పార్టీనే కరెక్ట్ అనుకున్నారో.. రాజకీయ సమీకరణాలు సరిపోతాయనుకున్నారో కానీ బీజేపీలో చేరిపోయారు. నిజానికి కాంగ్రెస్ భావజాలం నరనరాల జీర్ణించుకున్న వ్యక్తిగా.. బీజేపీలో కన్నాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి. కానీ కన్నా సీజన్డ్ పొలిటిషియన్ కాబట్టి.. సర్దుకుపోయారు.
కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష కిరీటం వచ్చిన తర్వాత కన్నాకు… బీజేపీ విధివిధానాల్ని ఒంట బట్టించుకోవడం.. దానికి అనుగుణంగా స్పందించడం ఇబ్బందికరంగా మారింది. సాధారణంగా మతం సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ భావజాలం వేరు. బీజేపీది వేరు. హిందూ అనే పేరు వినిపిస్తే.. రొమాలు నిక్కబొడుచుకునేలా.. బీజేపీలో నేతలు ఉండాలి. కానీ .. కత్తి మహేష్, పరిపూర్ణానంద ఎపిసోడ్ ప్రారంభమైన వారం తర్వాత కన్నాకు ఈ విషయం గుర్తుకు వచ్చింది. పరిపూర్ణానందకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. కత్తి మహేష్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్వీట్లు పెట్టారు. దేవుడిని లేక దేవతను ఉద్దేశించి తప్పుగా మాట్లాడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని తేవాలనే సదుద్దేశంతోనే పాదయాత్ర చేపట్టిన సన్యాసిని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టు అయిన జులై 9ను బ్లాక్‌డేగా అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ విధానాలను..మతాన్ని రాజకీయాలకు వాడుకోవాలన్ని కన్నా తీవ్రంగా విమర్శించేవారు. కానీ ఇప్పుడు అదే కన్నా..ఇప్పుడు అదే మత రాజకీయాల కోసం ట్వీట్లు, ప్రకటనలు చేయాల్సి వస్తోంది. పైగా హిందూత్వం.. అదీ కూడా బీజేపీ మార్క్ హిందూత్వం.. చూపించాలంటే.. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే సాధ్యం అవుతుంది. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన కన్నాకు అసలు సాధ్యం కాదు. అందుకే.. కన్నా చూపించే హిందూత్వంలో నిజాయితీ లేదని… దాని కోసం వేరే నేతల్ని ఉపయోగించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.