మెగా హీరోల్లో ఇంకో అంకె పెరిగింది. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తను కథానాయకుడిగా నటించిన ‘విజేత’ గురువారం విడుదల అవుతోంది. తొలి సినిమాతోనే డాన్సులు, ఫైటింగులు, మాస్ ఇమేజ్ అంటూ తాపత్రయ పడకుండా.. ఓ కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు కల్యాణ్ దేవ్. ఆ ప్రయత్నం మెచ్చుకోదగినదే. మరి.. ఈ సినిమాపై తన అంచనాలెలా ఉన్నాయి? ఈ సినిమా కోసం ఏమాత్రం కష్టపడ్డాడు? ఈ విషయాల గురించి కల్యాణ్ దేవ్‌తో చేసిన చిట్ చాట్ ఇది.
హాయ్ కల్యాణ్… రేపే మీ సినిమా విడుదల.. ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా?
నిన్నటి వరకూ ఒత్తిడి ఉండేదండీ. ఇప్పుడు రిలాక్స్ అయిపోయా. నిన్నంతా కారు వేసుకుని.. ఊర్లో ఉన్న హోర్డింగ్స్ అన్నీ చూసేచ్చాశా. దాంతో… ఎందుకో ఒత్తిడంతా తీసి పక్కన పెట్టేసినట్టైంది.
మెగా కుటుంబం నుంచి వస్తున్నారు. ఆ అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోగలనా, లేదా? అనిపించలేదా?
అంచనాలు ఉంటాయని తెలుసు. కాకపోతే… వాటికి సంబంధించిన ఒత్తిడేం నామీద లేదు. ఈ సినిమాని నేను చాలా ఆనందంగా పూర్తి చేశా. సెట్లో ప్రతీ నిమిషం ఆస్వాదించాను.
తొలి సినిమా కదా, కథలు చాలా విని ఉంటారేమో?
లేదండీ. సత్యానంద్ గారి దగ్గర శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన వారం రోజుల్లోనే ఈ కథ నా దగ్గరకు వచ్చింది. వినగానే బాగా నచ్చింది. తొలి సినిమా కదా.. ఇంకొన్ని కథలు వినాలేమో అనిపించింది. కానీ మావయ్య ఈ కథ విని.. ‘గో హెడ్’ అనేశారు. ఆయన అనుభవం ముందు మనమెంత? ఆయన చెప్పారు.. నేను నమ్మాను. దాంతో ఈ సినిమా పట్టాలెక్కింది.
చిరు అల్లుడు అయ్యాకే సినిమాలపై ఆసక్తి ఏర్పడిందా?
లేదండీ నాకు చిన్నప్పటి నుంచీ కళలంటే మక్కువ. బొమ్మలు వేసేవాడ్ని. పాడేవాడ్ని. డ్రామాలు వేసేవాడ్ని. ఇలా చాలా రంగాల్లో ప్రవేశం ఉంది. మా స్కూల్లో జరిగిన ఓ ఫంక్షన్‌కి చిరంజీవిగారు అతిథిగా వచ్చారు. నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పటి నుంచీ ఇంకొంత ఉత్సాహం వచ్చింది. దీనికి ముందు ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. కానీ.. అది వర్కవుట్ కాలేదు. `విజేత`తో.. ఇలా మీ ముందుకు వచ్చే అవకాశం వచ్చింది.
తొలి సినిమాకే మీ మావయ్య సినిమా టైటిల్ పెట్టుకున్నారు.. రిస్కనిపించలేదా?
నిజానికి ఈ సినిమా కోసం మరో టైటిల్ అనుకున్నాం. సగం షూటింగ్ అయ్యేంత వరకూ అదే వర్కింగ్ టైటిల్. కానీ ఓసారి సాయి కొర్రపాటిగారు ‘విజేత’ అనే టైటిల్ సూచించారు. కథకు అది మరింత బాగా నప్పుతుందనిపించింది. మావయ్య గారి పాటలు, సినిమా పేర్లూ రిపీట్ చేయడం నిజంగా ఓ సాహసమే. కాకపోతే.. కథకు ఈ టైటిల్ యాప్ట్ అనిపించింది.
డాన్స్‌లో ఏమైనా శిక్షణ తీసుకున్నారా?
లేదండీ. యాక్టింగ్పైనే దృష్టి పెట్టా. సినిమా మొదలవుతుందనగా కొన్ని రోజులు డాన్స్ ప్రాక్టీస్ చేశానంతే.
చిరు, చరణ్‌లు ఏమైనా సలహాలు ఇచ్చారా?
లేదండీ. రషెష్ చూసి ‘బాగున్నాయి’ అన్నారు. చిరంజీవి గారికి ఈ కథ బాగా నచ్చింది. ఆయన ఒక్క మార్పు కూడా చెప్పలేదు. నాన్న పాత్రకు మురళీ శర్మని తీసుకోండి అని సలహా ఇచ్చారంతే. అంతకు మించి కలగజేసుకోలేదు,.
తొలి రోజు షూటింగ్ అనుభవం ఎలా అనిపించింది?
నా కంఫర్ట్ జోన్లో నేనుండి షూటింగ్ చేసుకున్నా. తొలిరోజు కార్లోంచి దిగే సన్నివేశం చిత్రీకరించారు. కార్లోంచి నేను మాత్రమే దిగుతా. మిగిలిన యూనిట్ అంతా దూరంగా ఉంది. కాబట్టి.. పెద్దగా కంగారేం పడలేదు. సెట్లోకి వెళ్లగానే అందరితోనూ ఫ్రెండ్ షిప్ చేసుకోవడం మొదలెట్టా. చుట్టూ ఉన్నవాళ్లంతా నా వల్లే అనే ఫీలింగ్ వచ్చింది. దాంతో వారం రోజుల్లోనే సెట్ వాతావరణం అలవాటైపోయింది.
ఇక ముందు ఎలాంటి సినిమాలు చేయాలని వుంది?
కథే ముఖ్యం. అన్ని రకాల జోనర్లూ చేయాలని అనిపిస్తోంది. నాకు రియలిస్టిక్ సినిమాలంటే ఇష్టం. అలాంటి కథల్ని ఎంచుకుంటా.
మీకు నచ్చిన సినిమాలేంటి?
రాణీ ముఖర్జీ ‘బ్లాక్’ సినిమా అంటే చాలా ఇష్టం. ఫర్తాన్ అక్తర్ ‘భాగ్ మిల్కా భాగ్’ కూడా నా ఫేవరెట్ మూవీ. మావయ్య సినిమాలన్నీ ఇష్టం. అందులో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మరీ ఇష్టం.
రెండో సినిమా కూడా ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది?
అదేం లేదండీ. కొన్ని కథలు వింటున్నా. ఇంకా ఏదీ ఫిక్స్ కాలేదు.