పోలవరం ప్రాజెక్టు సందర్శనకు కేంద్రమంత్రి నితిన్ గట్కరీ రాష్ట్రానికి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పోలవరం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భాజపా కార్యకర్తలు పోలవరంలోకి వెళ్తామని పట్టుబడుతుంటే… కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి అని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే… ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పోలవరం గురించి మరోసారి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అనీ, దీనితో రాష్ట్రానికి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. టీడీపీ సర్కారుకి ఇది సంబంధం లేని విషయం అన్నారు. కేవలం కాంట్రాక్టర్లు, కేంద్రానికి మధ్య సమయన్వయకర్తగా వ్యవహరించడం వరకే రాష్ట్ర పరిధిలోని అంశం అని కన్నా అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఒక్క పైసా కూడా బాకీ లేదని కన్నా స్పష్టం చేశారు. పోలవరం ఏపీకి గుండెకాయ లాంటిదనీ, రాజకీయాల కోసం దాన్ని నొక్కెయ్యోద్దని హితవు పలికారు! అనుకున్న గడువులోగా కేంద్రమే ప్రాజెక్టు నిర్మిస్తుందన్నారు. ప్రాజెక్టుపై రాష్ట్రం అనవసర పెత్తనం చేస్తోందనీ, కేవలం రాజకీయం చేసి తమను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ విమర్శించారు. ప్రతీపైసా తామే ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటో చెప్పాలన్నారు. తమ మంచితనాన్ని అలసత్వంగా తీసుకుని దోషిగా నిలబెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది కాదనీ, తమది అని కన్నా చెప్పారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టే.. కాదని ఎవరంటారు..? కాకపోతే, ఆ ప్రాజెక్టు నిర్మాణం తమ బాధ్యతే అనేది కేంద్రానికి గుర్తుండటం లేదన్నదనే కదా సమస్య! పోలవరంతో చంద్రబాబుకు పనేంటని కన్నా ఇప్పుడు అంటున్నారు! ఒకవేళ ఏపీ సర్కారు బాధ్యత తీసుకుని ఉండకపోయుంటే… పోలవరం నిర్మాణం ఇలా జరిగేదా..? ప్రతీవారం సమీక్షలు చేస్తూ… విర్చువల్ ఇన్ స్పెక్షన్ నిర్వహిస్తూ… అధికారులూ ఇంజినీర్లతో నిత్యం టచ్ లో ఉండబట్టే కదా పనులు వేగంగా సాగుతున్నాయి. పోలవరం వేగవంతంగా నిర్మాణం జరుగుతోందంటే కారణం చంద్రబాబు ప్రయత్నమే అనేది అందరికీ తెలిసిన విషయమే.
పోలవరంపై భాజపాకి, ముఖ్యంగా ఏపీ భాజపా నేతలకు అంత బాధ్యత ఉంటే… ఇన్నాళ్లూ ఏమయ్యారు..? ఆ మధ్య, కొన్ని పనుల్ని వేరే కంపెనీకి బదలాయించాలని రాష్ట్రం భావిస్తే, కేంద్రం మోకాలడ్డినప్పుడు కన్నా ఎక్కడున్నారు..? సరే, ఆయన భాజపాలోకి అప్పటికి రాలేదు. మిగతా భాజపా నేతలైనా కేంద్రంతో సంప్రదింపులు జరిపారా..? పోలవరం ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని విమర్శలు చేయడానికే పరిమితమౌతూ వచ్చారే తప్ప… పనులు వేగవంతం చేయాలని ఏపీ కమలనాథులు ఎప్పుడైనా డిమాండ్ చేశారా..? ఇవాళ్ల పనులన్నీ ఒక కొలీక్కి వస్తున్న తరుణంలో.. ఇదంతా మాదే, సీఎంకి ఏంటి సంబంధం అంటే ప్రజలు నమ్ముతారా..?