రూ. 5 కే పేదలకు భోజనం అందించాలన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలో అన్న క్యాంటీన్ ని లాంఛనంగా ఓపెన్ చేశారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా, పేదల ప్రజలకు పరిశుభ్రమైన భోజనం ఈ క్యాంటీన్ల ద్వారా అందిస్తామని సీఎం చెప్పారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా 25 మున్సిపాలిటీల్లో 60 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మరో నెల వ్యవధిలో మొత్తంగా 203 క్యాంటీన్లు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వద్దనీ, అవసరాన్ని బట్టీ వీటి ఆధునీకరణకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, వీటి నిర్వహణకు దాతల నుంచి విరాళాలను కోరారు. ఆ వెంటనే, కొంతమంది టీడీపీ నేతలు విరాళాలు కూడా ప్రకటించారు. దీని కోసం ఒక ప్రత్యేక ట్రస్టును కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
నిజానికి, ఇది చాలామంచి కార్యక్రమం. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు సక్సెస్ అయ్యాయి. అక్కడ అమ్మ క్యాంటీన్లలో నాణ్యత గురించి గొప్పగా చెప్పుకుంటారు. తెలంగాణలో కూడా రూ. 5కి భోజనం పథకం అమల్లో ఉంది. అయితే, ఇలాంటి పథకాల ప్రారంభంలో ఉన్న ఉత్సాహం రానురానూ నిర్వహణలో కూడా కొనసాగాలి. ఏపీలో ఈ క్యాంటీన్ల నిర్వహణను అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ఇస్కాన్ కు చెందిన సంస్థ కాబట్టి, సుచి శుభ్రం విషయంలో రాజీపడరనే అభిప్రాయం ఉంది. ఎలాగూ ఇదో ఆధ్యాత్మిక సంస్థకు అనుబంధంగా ఉంది కాబట్టి, సేవా కార్యక్రమాన్ని వాణిజ్య దృక్పథంతో చెయ్యరూ అనే గుర్తింపూ ఉంది.
కాబట్టి, అన్న క్యాంటీన్ల నిర్వహణ వారికే ప్రభుత్వం అప్పగించిందని చెబుతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజూ రెండున్న లక్షల మందికి అన్నం పెట్టాలన్నది లక్ష్యం. ప్రతీ పూటకి 300 మందికి భోజనం ప్రిపేర్ చేస్తారని చెబుతున్నారు. భోజనానికి వచ్చేవారి సంఖ్య పెరిగితే.. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తారట. ఈ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు అందించే ఆహారం మెనూను కూడా ప్రభుత్వమే తయారుచేసింది. ఏరోజు ఏయే వంటకాలు ఉండాలనేది కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. ప్రారంభం కాబట్టి… వినడానికి అంతా బాగానే ఉంది. నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్వహిస్తే.. ఇది నగర పేదలకు బాగా ఉపయోగపడే పథకం అవుతుందనడంలో సందేహం లేదు.