చట్టం అందరికీ సమానమేనని అందరూ చెబుతూంటారు. చివరికి చట్టం కూడా అదే చెబుతుంది. కానీ కొంత మందికి ఎక్కువ సమానం. డబ్బున్నవారికి ఒకలా.. పలుకుబడి ఉన్నవారికి ఒకలా.. సామాన్యులకు మరోలా సమానంగా చట్టం ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల..పురుషుల కన్నా.. మహిళలకు మరింత ఎక్కువగా సమానంగా ఉంటుంది. ఇలాంటి చట్టమే… ఐపీసీ సెక్షన్497. వివాహేతర బంధం నేరంగా ఈ చట్టం చెబుతోంది. కానీ వివాహేతర బంధానికి మహిళ ప్రోద్భలం ఉన్నా, కేవలం పురుషుడికి మాత్రమే శిక్ష విధించాలనే నిబంధన ఉంది. వివాహేతర సంబంధం కలిగివున్న మహిళ అన్ని సందర్భాల్లో కేవలం బాధితురాలిగా మాత్రమే పరిగణించబడుతోంది. సంబంధం కలిగివున్న పురుషుడికి గరిష్టంగా ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
చట్టం అందరికీ సమానమైనప్పుడు.. ఇక్కడ మహిళకు ఎందుకు మినహాయింపు అన్న విషయాన్ని గుర్తిస్తూ.. ఈ సెక్షన్ను తొలగించాలని కేరళకు చెందిన జోసెఫ్షైన్ అనే వ్యక్తి డిసెంబర్లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఒక రిలేషన్షిప్లో కేవలం పురుషుడు మాత్రమే ఆకర్షిస్తాడా?. వేరొకరి భార్యతో సంబంధం కలిగివున్న పురుషుడికి మాత్రమే జైలు శిక్ష ఎలా వేస్తారు భర్త అంగీకారంతో భార్య వేరొకరితో సంబంధం కలిగివుంటే అతన్ని శిక్షించకుండా వదిలేయాలా? అనే ప్రశ్నలను.. పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు.
పిటిషన్ వేసినప్పుడు… సుప్రీంకోర్టు ధర్మాసం.. ఒక మహిళను పురుషుడితో సమానంగా సెక్షన్497 చూడటం లేదని ప్రాథమికంగా నిర్ధారించింది. చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రానికి సెక్షన్497 కాన్సెప్ట్ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సెక్షన్497ను తొలగిస్తే దేశంలో కల్లోలం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ కౌంటర్ వేసింది. సెక్షన్ను కొనసాగించడం ద్వారానైనా హద్దులు మరచి ప్రవర్తించే కొంతమందినైనా అడ్డుకోవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.