తెలుగు360.కామ్ రేటింగ్ :2/5
ఎమోషన్స్‌కి మరణం లేదు. దాని వ్యాలిడిటీ జీవితకాలం.
అమ్మా – నాన్న,
తండ్రీ – కొడుకు,
ఇల్లు – పిల్లలు… ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పుకున్నా తరిగిపోని కథలు.
తండ్రి కోసం తపించే కొడుకు, కొడుకు కోసం త్యాగాలు చేసే తండ్రి – ఇలాంటి కథలు బ్లాక్ అండ్ వైట్ జమానాలో తెగ వచ్చేవి. హిట్లు కూడా కొట్టేవి.
అయితే.. ఈ స్పీడు యుగానికి ఇదంతా చాదస్తంలా కనిపిస్తుంది. టీవీ సీరియళ్ల పుణ్యమా అని – అవన్నీ ఇంటి పట్టునే చూసే అవకాశం దక్కుతుంది. ఇది వరకటిలా.. తండ్రి చెప్పే సూక్తులు, బాధ్యతల గురించి ఇచ్చే స్పీచులు చెవికి ఎక్కడం లేదు. ‘ఇదంతా ఎందుకొచ్చిన సోది’ అనిపిస్తుంటుంది. కాకపోతే ఆ తరహా ప్రయత్నాలుఅప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ‘విజేత`లో అలాంటి ప్రయత్నం కనిపించింది.
కథ
శ్రీనివాసరావు (మురళీ శర్మ) మంచి నాన్న. ఫొటోగ్రఫీ అంటే ప్రాణం.కానీ బాధ్యతలు అతని కళని తొక్కేస్తాయి. ఓ సాధారణ ఉద్యోగిగా జీవితం కొనసాగిస్తుంటాడు. తన కొడుకు రామ్ (కల్యాణ్‌దేవ్)కి మాత్రం ఏ లోటూ రాకుండా చూసుకుంటుంటాడు. అరకొర మార్కులతో ఇంజనీరింగ్ పాసైన రామ్‌కి ఉద్యోగాలు దొరకవు. ఆవారాగా తిరిగేస్తుంటాడు. మరోవైపు తండ్రిపై బాధ్యతలు పెరుగుతుంటాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. రామ్ చేసే తింగరి పనుల వల్ల.. అవమాన భారంతో కృంగిపోతుంటాడు శ్రీనివాసరావు. తండ్రి ఆవేదనని, తపనని రామ్ ఎప్పుడు, ఎలా అర్థం చేసుకున్నాడు? తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? తాను విజేతగా నిలవడమే కాకుండా.. తండ్రిని విజేతగా ఎలా నిలబెట్టాడు? అనేదే `విజేత` కథ.
విశ్లేషణ
దర్శకుడు రాసుకున్న పాయింట్లో… మంచి పాయింట్ ఉంది. ఓ మంచి తండ్రికీ, మంచి తనయుడికీ ఆ విషయం అర్థమవుతుంది. తండ్రి కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తీసుకురావడం కంటే… ఓ కొడుకు చేసే గొప్ప పని ఏముంటుంది? ‘విజేత’ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. నువ్వు ఇలానే ఉండు, ఇదే చేయ్.. అంటూ దండించే తండ్రులున్న ఈ సమాజంలో శ్రీనివాసరావు పాత్ర ఉదాత్తంగా తోస్తుంది. కాస్త వయసొచ్చాక, జేబులో డబ్బులొచ్చాక.. ‘నాన్నయితే ఏంటట’ అంటూ కాలర్ పట్టుకోగలిగిన కొడుకులు ఉన్న ఈ సమాజంలో… రామ్ పాత్ర కూడా అంతే నచ్చుతుంది. పతాక సన్నివేశాలు చూస్తే…. మనకీ ఓ మంచి కొడుకు, మంచి తండ్రిగా నిలవాలనిపిస్తుంది. అనుకున్న పాయింట్ బలంగా ఉండడం, అందులో ఉదాత్తమైన లక్షణాలు ఉండడం ఒక్కటే సరిపోదు. కథని ఎలా నడిపిస్తున్నాం.. ఎవరికి చేరువ అయ్యేలా చెబుతున్నాం? అనేదీ ప్రధానమే.
ఇలాంటి కథని ‘రా’గా చెప్పడం మనకు ఇంకా తెలీదు. దానికి కాస్త వినోదపు పూత పూసి ఇవ్వాల్సిందే. ‘బొమ్మరిల్లు’ చూడండి. దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూ… క్లైమాక్స్‌లో చెబుతాడంతే. మిగిలిన సన్నివేశాల్ని, సందర్భాల్ని అందుకు లీడ్‌గా వాడుకుంటాడు. అలాగని స్పీచులిచ్చే ప్రయత్నం చేయడు. ఓ మంచి ప్రేమకథని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు. అదే ‘విజేత’లో మిస్ అయ్యింది. ఓ మంచి ప్రేమకథ నడిపించే అవకాశం ఉన్నా దర్శకుడు అటువైపుకు పోలేదు. అసలు లవ్ ఎలిమెంట్ నే టచ్ చేయలేదు. స్నేహితుల గ్యాంగ్‌తో కామెడీ చేయించాలన్న ప్రయత్నం అక్కడక్కడ మాత్రమే వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్ మరీ స్లోగా నడుస్తోందని భావించిన దర్శకుడు సత్యం రాజేష్‌ని రంగంలోకి దింపి కాస్త నవ్వులు దండుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదంతా వేరే తానులో ముక్క అని స్పష్టంగా అర్థమైపోతుంది.
హీరో ఓ ఈవెంట్ కంపెనీ పెట్టడం, ఓ కుటుంబాన్ని కలపడం, తద్వారా తన ఇంట్లోని సమస్యని సైతం పరిష్కరించడం ఇవన్నీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు, అందులో ఉన్న ఎమోషనే ఈ కథకు కొంత బలం. అవి మనసుకు హత్తుకుంటే దర్శకుడు అనుకున్న గోల్ రీచ్ అయినట్టే. అయితే అప్పటి వరకూ ఓపిగ్గా ఈ సినిమా చూడాల్సివస్తుంది. కథనం నెమ్మదిగా సాగడం, వినోదం కేవలం అక్కడక్కడ మాత్రమే పండడం, లవ్ ట్రాక్‌కి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ప్రధాన లోపాలుగా కనిపిస్తాయి.
నటీనటులు
అన్నప్రాసన రోజునే ఆవకాయ్ తినేయాలి అనేంత ప్రయోగాలేం చేయలేదు కల్యాణ్ దేవ్. సాధారణంగా మెగా ఇంటి నుంచి వచ్చిన హీరోలు మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడతారు. దాని జోలికి కూడా వెళ్లలేదు. రామ్ పాత్రకు ఏం కావాలో అది చేశాడు. ఈజ్, నటన, డాన్సులు ఇవన్నీ ఓకే. సినిమా సినిమాకీ నేర్చుకుంటూ ఎదుగుతారు కాబట్టి.. దేవ్‌కి కూడా కాస్త టైమ్ ఇవ్వాలి. సాధారణంగా మాళవిక నాయర్ కథానాయిక పాత్ర పోషిస్తే.. అందులో ఏదో ఉంటుందనే అనుకుంటారు. ఎందుకంటే తను బేసిగ్గా మంచి నటి. కానీ ఈ పాత్రకు అంత స్కోప్ లేదు. మురళీ శర్మ నటనే ఈ చిత్రానికి బలం. ఓ మంచి నాన్నగా మరోసారి ఆ పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. ప్రకాష్‌రాజ్, రావు రమేష్ లకు తాను ఎంత గొప్ప ప్రత్యామ్నాయమో మరోసారి నిరూపించాడు.
సాంకేతిక వర్గం
సెంథిల్ని కెమెరామెన్‌గా పెట్టుకుని మంచి పని చేశారు. కెమెరా ఎక్కడ పెట్టినా ఫ్రేమ్ అందంగా కనిపించిందంటే అదంతా సెంథిల్ పనితనమే. పాటలు, నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి. చికెన్ పాట మరీ బాగుంది. కాకపోతే… దాని కోసం సందర్భం సృష్టించుకున్నారంతే. దర్శకుడి కథ… చాలా సాధారణంగా ఉంది. దాని తీత కూడా అలానే ఉంది. ఓ తండ్రికి కొడుకుగా, కొడుకుకి తండ్రిగా ఎలా ఉండాలన్నది బాగా చూపించారు.
కాకపోతే.. దాని కోసం ఇంత సినిమా తీయాల్సిన అవసరం లేదు. చివర్లో శ్రీనివాసరావు అవార్డు కొట్టిన ఫొటో ఒక్కటి చూపిస్తే చాలు.
తీర్పు
ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. అయితే ఆ ఎమోషన్స్ పండాలంటే అంతకంటే బలమైన కథ, కథనాలు అవసరం. అవే `విజేత`లో లోపించాయి. `నేనో ఫీల్ గుడ్ సినిమా తీస్తున్నా..` అనే గిరి గీసుకుని కూర్చున్నాడు దర్శకుడు. అందుకే సన్నివేశాలు నిదానంగా, పాత్రల ప్రవన్తన చాదస్తంగా అనిపిస్తాయి. మురళీ శర్మ నటన, పతాక సన్నివేశాలు మాత్రమే ఈ విజేత బలం. కానీ ఓ సినిమా విజేతగా నిలవడానికి అవి మాత్రం సరిపోవు.
ఫినిషింగ్ టచ్: విజయానికి చాలా దూరంగా…
తెలుగు360.కామ్ రేటింగ్ :2/5